దేశం కోసం, ధర్మం కోసం సంజయ్ అంటున్నడు. ఆయన కొడుకు మాత్రం ‘రాముడు లెక్క పనిచేసిండా.. రావణుని లెక్క చేసిండా?’ నిజాలు చెబితే జీర్ణించుకోలేక కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దీనికి రెండు రోజుల్లోనే ఆయన కొడుకుపై పోక్సో కేసు నమోదవడం కర్మఫలమే. ఈ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ, బాధితురాలిని ఇబ్బంది పెట్టడం హేయమైన చర్య.
– బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్
రాజన్న సిరిసిల్ల, మే 11 (నమస్తే తెలంగాణ) : బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సంజయ్ కొడుకుపై కేసు నమోదై 48 గంటలు దాటినా అరెస్ట్ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో ఓ మైనర్ కేసు విషయంలో బండి సంజయ్ ప్రగాల్భాలు పలికాడని, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందన్నారు. ఇతరులకో న్యాయం, తన కొడుకు వరకు వస్తే మరొక న్యాయమా? అని నిలదీశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మోసం చేసిన భగీరథ్‌పై బాధితురాలి తల్లి ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినా ఐదు గంటల సేపు స్టేషన్లో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ప్రధాని సభలో తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలిక హెచ్చరిస్తే గత్యంతరం లేక నామమాత్రంగా కేసు నమోదు చేశారని విమర్శించారు. తర్వాత సంజయ్ కరీంనగర్లో తన కొడుకుతో బాధితురాలిపై ఫిర్యాదు చేయించడంలో మర్మమేమిటని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్‌కు, బాధిత కుటుంబానికి మధ్యవర్తిగా సంగప్ప అనే విలేకరిని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురిచేశారని మండి పడ్డారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు, అరెస్ట్ చేయకపోవడం వంటి విషయాలను ఓ వర్గం మీడియా ప్రచురణ, ప్రసారం చేయకుండా వత్తాసు పలికారని విమర్శించారు.
ప్రధాని సభలో బండి సంజయ్ మొసలి కన్నీరు కార్చడం కాదని, చిత్తశుద్ధి ఉంటే నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలని హితవుపలికారు. మోదీ సభలోనే మరోసారి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని ప్రజలకు స్పష్టంగా తెలిసి పోయిందన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసులోని సెక్షన్లన్నీ స్పష్టంగా నమోదు చేసి, వెంటనే అదుపులోకి తీసుకోవాలన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, న్యాయం జరగకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఆ తర్వాత భగీరథ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ మహేశ్ బీ గీతేకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, మ్యాన రవి, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, సింగిల్ విండో మాజీచైర్మన్ ఉమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, అకుల చిన్న, గెంట్యాల శ్రీనివాస్, మోతె మహేశ్, సాయి, బోల్గం నాగరాజు, కొండ శ్రీనివాస్, కౌన్సిలర్లు, బింగి రాంబాబు, బూర బాలు, నాగరాజు, నెల్లుట్ల నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు నైతిక విలువలు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించే హోదాలో ఉండి భక్షకుడు అయ్యాడు. రాష్ట్ర హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఇద్దరూ ఉండి బాధితురాలికి న్యాయం చేయడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ బంధం ఏంటో అందరికీ అర్థమైంది. బాధితురాలి పక్షాన ఉండాల్సిన మీడియా ప్రతినిధి సంగప్ప బండి సంజయ్‌కు మధ్యవర్తిత్వం చేయడం దురదృష్టకరం. ఇతర మీడియాలోనూ వార్తలను ప్రచారం చేయకపోవడం శోచనీయం.
– నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
మంథని, మే11 : కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, భగీరథ్ కేసు విషయంలో బాలిక కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తున్నాయని జయ శంకర్ భూపాలపల్లి మాజీ జడ్పీ చైర్ పర్సన్ జకు శ్రీహర్షిణీ రాకేశ్ విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగతున్నాయని, భగీరథ్‌ను ప్రభుత్వం కాపాడేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. మంథని రాజగృహలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహిళలకు అండగా ఉంటామని, రక్షణ కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారని, కానీ, పోక్సో కేసుపై ఇప్పటి వరకు స్పందించకపోవడం చూస్తుంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ తరఫున మహిళాలోకంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తగరం సుమలత శంకర్ లాల్, కేదారి గీత, పుప్పాల భాగ్యలక్ష్మి తిరుపతి, ఆశా కుమారి పాల్గొన్నారు.