శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో ఒక్కో రైతుది ఒక్కోగాధ. ఎవరిని కదిలించినా రుణమాఫీ వెతలే వెలికి వస్తున్నాయి. ఈ ఊళ్లో ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. 400 మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం పెట్టిన మెలికలన్నింటికీ సరిపోతున్నా రుణమాఫీ ఎందుకు కాలేదో ఈ గ్రామ రైతులకు బోధపడడం లేదు. రూ.2 లక్షలకు పైన అప్పు తీసుకున్న రైతులు వాటిని చెల్లిస్తేనే మాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పడాన్ని ఈ గ్రామ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందు గ్రామ సభలు పెట్టి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ బృందం ముందు గ్రామ రైతులు ఒక్కొక్కరు తమ బాధలను ఏకరువు పెట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎదుట సుమారు 100 మంది రైతులు నిరసన తెలిపారు. రుణమాఫీ కోసం వారు పడుతున్న గోడును చెప్పుకొన్నారు.
తమ గ్రామంలో రైతు గ్రామ సభలు నిర్వహించాలని, అర్హత ఉండి రుణమాఫీకి నోచుకోని వారిని గుర్తించాలని, గ్రామ సభ ద్వారానే ఇది సాధ్యమవుతుందని కన్నాపూర్ రైతులు స్పష్టం చేశారు. గ్రామ సభకు వ్యవసాయ అధికారులతోపాటు బ్యాంక్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చి తమ బాధలు వినాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ చేసే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. రూ.2 లక్షలకంటే రుణం ఎక్కువ ఉన్న రైతులు మిగతావి చెల్లించాలని, అప్పుడే రూ.2 లక్షలు వర్తిస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పేర్లు మాఫీ జాబితాలోనే లేనప్పుడు ఎట్లా చెల్లిస్తామని నిలదీశారు. బ్యాంకుల వారీగా తమ గ్రామంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తే నిమిషాల్లో మిగిలిన మొత్తం చెల్లిస్తామని స్పష్టం చేశారు. తాము ఎంత బాకీ ఉన్నా రూ.2 లక్షలు మాఫీ చేస్తే సరిపోతుంది కదా?, మాఫీ చేయడం చేతకాక ఇవ్వన్ని సాకులు ఎందుకు చెబుతున్నారని మంత్రిని ప్రశ్నించారు.
మొలంగూర్ ఇండియన్ బ్యాంకుల నా పేరు మీద రూ.1.60 లక్షలు, మా బాపు పోచమల్లు పేరు మీద రూ.32 వేలు అప్పున్నది. ఇద్దరిది కలిపితే రూ.2 లక్షలు సుతం అయిత లేదు. కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్టు ఒక కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ అయినా మా ఇద్దరి అప్పు మాఫీ కావాలె. మొదటి విడుతల మా బాబు పేరు వస్తదని చూస్తే రాలే. కనీసం మూడో లిస్టులన్నా నా పేరు ఉంటదని చూస్తే లేదు. కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేస్తమన్నరుకదా.. మా ఇద్దరిట్ల ఎవల్దొక్కలదన్నా మాఫీ కావద్దా..? ఇదేం పద్ధతన్నట్టు. మేమేమన్నా రుణాలు ఎగవెట్టెటోళ్లమా. ఆరు నెల్లకోసారి వడ్డీతో సహా కట్టి రెన్యువన్ చేయించుకోనేవడ్తిమి. మాకెందుకు అప్పు మాఫీ కాదు?
కేసీఆర్ సర్కారున్నపుడు మాఫీ అయినయ్. మా ఊళ్లె చానా మంది లాభపడ్డరు. ఇప్పుడు నాతోసహా చానా మందికి మాఫీ కాలే. నేను తీసుకున్నది ఉత్త రూ.33 వేలే. మొదటి విడుతలనే మాఫీ కావాలె. మూడో విడుత అయిపోయింది. ఏ లిస్ట్‌ల నా పేరు లేదు. నా అసోంటి చిన్నది లెక్కకే రాలేదంటే రూ.2 లక్షలు మాఫీ చేస్తమంటే ఎట్ల నమ్ముడు. ఇదంతా బోగస్. మాతోని నాటుకాలు ఆడుతున్నరు. ఈ చిన్న మొత్తం మాఫీ కోసం బ్యాంకుకు పోతే మాకు తెల్వది. వ్యవసాయ అధికారులను అడుగుమంటున్నరు. వ్యవసాయ అధికారుల వద్దకు పోతే బ్యాంకు స్టేట్మెంట్ తెమ్మంటరు. అటు తిరిగి ఇటు తిరిగి పానం పోతుంది గానీ పైసలైతే మాఫీ కాలే. ఇప్పుడు ఎట్లయితే గట్లయితది. మళ్ల ఓట్లని అడిగెతానికి వచ్చినప్పుడు చెప్తం.
మాకు ఉన్నదే ఎకురం. బ్యాంకుల రూ.43 వేలు అప్పున్నం.. మొలంగూర్ ఇండియన్ బ్యాంకుల తీసుకొని ఏడాది కూడా ఐతలేదు.. మొదటి విడుత అన్నరు.. రెండో విడుత అన్నరు.. లాస్ట్‌కు మూడో విడుతల కూడా మాకు మాఫీ కాలే.. మేం గదే తిరుగుడు.. వాళ్లేమో చెప్పిందే చెప్పుతాన్రు తప్ప మాఫీ మాత్రం అయితలేదు.. గట్టిగ అడిగితే బ్యాంకోళ్లు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు.. అందులో ఏం లేదు.. పై నుంచి మాఫీ కాకపోతే మేమేంజేత్తం అంటన్రు.. రెండో విడుత తర్వాత ఏఈఓ మేడం వద్దకు పోయి దరఖాస్తు ఇస్తే లాస్ట్ విడుత దాకా చూద్దాం.. ఇప్పుడు ఇయ్యకుండ్రి.. మీరు ఇచ్చినా మేం పక్కకు పెడుతం.. లాస్ట్ విడుత అయిపోయినంక పడకపోతె గప్పుడు రాండ్రి అన్నరు.. మాకు న్యాయం జరిగేదాకా రోడ్లెక్కుతం.
అంతా అయిపోయింది. మూడు విడుతలు వచ్చినయ్. దేంట్ల నా పేరు లేదు. నా భార్య కనకలక్ష్మి పేరు లేదు.. ఇంకెప్పుడు ఇస్తరు. మేం మెట్పల్లి సహకార బ్యాంకుల 2018 నుంచి అప్పు తెచ్చుకుంటున్నం. నా పేరు మీద రూ.80 వేలున్నయి. నా భార్య పేరు మీద రూ.లక్ష ఉన్నది. ఇద్దరియి కలిపినా రూ.2 లక్షలు కావాయె. మరి నా పేరు ఎందుకు రాకపాయె. నా భార్య పేరు ఎందుకు రాకపాయె. మేం అర్హులం కాదా.. మేం ఈ ఊళ్లె పుట్టలేదా..? మాఫీ అంటే అందరికీ కావాలె. కొందరికి ఇచ్చుడేంది. కొందరికి ఇయ్యకపోవుడేంది. ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పినట్టు ఇప్పుడు రైతుల దగ్గరికి వచ్చి చెప్పస్త లేదా.. కాంగ్రెసోళ్లకు మొఖాలు లేవా..? మునుపు కేసీఆర్ ఉన్నపుడు గిట్లనే చేసిండా..? బక్క సక్కోళ్లనిడ్సిపెట్టి బలిసినోళ్లకే మాఫీ చేస్తున్నరు. మునుపు వచ్చినోళ్లకే మళ్లచ్చినయి. ఇప్పుడు రానోళ్లు చానా మంది ఉన్నరు.
మేం పోయినసారి మొలంగూర్ బ్యాంకుల నా పేరున రూ.80 వేలు, మా ఆయన సమ్మయ్య పేరున రూ.లక్ష అప్పు తీసుకున్నం. ఇద్దరి అప్పు కలిసినా రెండు లక్షలు దాటుతలేదు కదా..! మరి మా అప్పు ఎందుకు మాఫీ కాలే.. ఇప్పటికి పది సార్ల మొలంగూర్ బ్యాంక్ చుట్టూ తిరిగినం.. పురుగులను చూసినట్లు చూస్తన్రు.. ఒక్కళ్లు సక్కగ సమాధానం చెప్పరు.. వీళ్లేమైనా వాళ్ల ఇంట్లకేంచి తెచ్చి మాకు పైసలు ఇత్తున్నరా.. మేం రైతులం కామా?.. మేం ఓట్లు వేయలేదా..? సర్కారు అధికారులు మనిషికోరకంగా ఎందుకు చేస్తుండ్రు.. అందరికీ ఒకేలాగ చేస్తేనే న్యాయం చేసినట్టు.. రైతుకోరకంగా చేస్తే ఎట్లా.. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగాలె.
మాకు ధర్మారం గ్రామ శివార్ల 103/బీ సర్వే నంబర్ల 20 గుంటల పొలం ఉంది. దాదాపు ఏడాది ఐతందనుకుంట.. పెట్టువడికి పైసలు లేకుండె.. మా ఊరోళ్లతో వెళ్లి నేను సుత మొలంగూర్ ఇండియన్ బ్యాంకుల రూ.25 వేల అప్పు తీసుకున్న.. మా ఊరోళ్లు ఎప్పుడు రమ్మంటె అప్పుడు పోతన్న.. బ్యాంకు సుట్టూ తిరుగుతన్నం.. నెల రోజులైతంది.. మాఫీ ఇగ జేత్తలేరు.. అగ జేత్తలేరు.. తిరిగీ తిరిగి కాళ్లు నొత్తన్నయ్ తప్పితే మాఫీ ఐతలేదు.. ఏమైందని బ్యాంకోళ్లను అడిగితే. మాదేం లేదు.. పైన పెద్దోళ్లే చేస్తలేరని చెప్పవట్టిరి.. సర్కారు గీ కొద్ది పైసలు కూడా మాఫీ చేయకుంటె ఎట్ల చెప్పుండ్రి.
కేడీసీసీబీ మెట్పల్లి శాఖ, ఇండియన్ బ్యాంక్ మొలంగూర్ శాఖ, యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కేశవపట్నం శాఖల్లో తమ గ్రామ రైతులు సుమారు 600 మంది అప్పు తీసుకుంటే కేవలం 200 లోపే మందికి మాఫీ అయ్యిందని శంకరపట్నం మండలం కన్నాపూర్ రైతులు తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ బృందం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినపుడు తమ గ్రామంలో రైతులు పడుతున్న బాధలను ఏకరువు పెట్టారు. గ్రామంలో రూ.20 వేలు, రూ.30 వేలు అప్పు తీసుకున్న చిన్న చిన్న రైతులకు కూడా మాఫీ కాలేదని చెప్పారు. 99 శాతం మంది రైతులం రెగ్యులర్‌గా రెన్యువల్ చేసుకుంటామని, తమకెందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నించారు. పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి (రూ.33 వేలు), యాంసాని కృష్ణమూర్తి (రూ.35 వేలు), పంచకోటి లింగమూర్తి (రూ.37 వేలు) మాట్లాడుతూ తమ పేర్లు మొదటి జాబితాలోనే రావాల్సినవని, మూడో జాబితాలో కూడా రాలేదని, ఇంకెప్పుడు ఇస్తారని వాపోయారు. మాఫీ జాబితాలో రాని వారు బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకుని వచ్చి తమకు ఇవ్వాలని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి చెబితే పది రోజుల కింద ఇచ్చినా ఇప్పటి వరకు సడీ చప్పుడు లేదని తాను ఇచ్చిన దరఖాస్తు పెంట బొందల ఏసినట్టే ఉన్నారని కాటం తిరుపతిరెడ్డి అనే రైతు మండిపడ్డాడు. మాఫీ కాని వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే మాఫీ అయిన వారి పరిస్థితి మరోలా ఉందని కొందరు చెప్పుకొచ్చారు. తమ గ్రామానికి చెందిన రెడ్డి వీరయ్య అనే రైతు రూ.1.30 లక్షలు అప్పు తీసుకుంటే ఈ నెల 9 వరకు వడ్డీతో కలిపి రూ.1,36,500 అయ్యాయని, ఇందులో రూ.1.32 లక్షలు మాత్రమే మాఫీ కింద చూపారని, మిగతా రూ.4,500 చెల్లించే వరకు మెట్‌పల్లిలోని కేడీసీసీ బ్యాంకులో రెన్యువల్ చేయలేదని చింతిరెడ్డి వెంకటరెడ్డి అనే రైతు చెప్పాడు. నిజానికి రూ.2 లక్షల వరకు అప్పు మాఫీ చేసినపుడు వీరయ్యకు చెందిన రూ.1,36,500 ఎందుకు మాఫీ చేయలేదని వెంకటరెడ్డి ప్రశ్నించాడు.
నా పేరు, మా భార్య సరమ్మ పేరు మీద మొలంగూర్ ఇండియన్ బ్యాంకుల క్రాఫ్‌లోన్ తీసుకున్నం. నా పేరు మీద 31 గుంటలు ఉంటే రూ.38 వేలు ఇచ్చిండ్రు. మా భార్య పేరు మీద 3 ఎకరాలు ఉంటే రూ.లక్ష ఇచ్చిండ్రు. 2018 నుంచి కడుతున్నం, తీసుకుంటున్నం. అప్పు మాఫీ అయితదంటే సంతోషపడ్డం. మా ఇద్దరిది కలిపి రూ.లక్షా యాభై వేలు సుతం లేకపాయె. రెండో విడుతల ఎందుకు ఇయ్యనట్టు. పోనీ వడ్డీ పెరిగి రూ.2 లక్షలు దాటిందా? అని అనుకుంటే మొన్ననే వడ్డీతో సహా కడ్తిమి. బ్యాంకుకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగితే మూడో విడుతల వస్తదని చెప్పిండ్రు. ఈ విడతల సుత రాకపాయే. ఇగెప్పుడిస్తరు. చెర్ల నీళ్లువోయి చెరువెన్కవడ్డంక ఇస్తరా..? ఇదంతా మంచిగ లేదు. ఇస్తరో ఇయ్యరో ఇప్పటికీ ఎవ్వలు చెప్తలేరు..