ఉపాధి హామీ పథకం అమలుకు వెన్నెముక అయిన ఫీల్డ్ అసిస్టెంట్లకు భరోసా కరువవుతున్నది. తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయింది. రెండున్నరేళ్లు గడుస్తున్నా అమలు చేయకుండా చోద్యం చూస్తుండడంతో ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. నేటికీ అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొట్టుస్తున్నా.. క్రమబద్ధీకరణ లేక ఉగ్యోగాలు గాలిలో దీపంలా ఉన్నా.. సర్కారు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం కనిపిస్తున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 19 : ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామాల్లో ఉపాధి పనుల పర్యవేక్షణ, కార్మికుల హాజరు నమోదు, పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, ఫొటోల అప్లోడ్, వేతనాల చెల్లింపు, జాబ్‌కార్డులు వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా పంచాయతీల్లో ఏటా చేపట్టే వనమహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛభారత్, ఇంకుడు గుంతలు, వైకుంఠధామాల అభివృద్ధి, గ్రామ నర్సరీలు, మట్టి రోడ్లు, పశువులు, గొర్ల పాకలు, జల సంరక్షణ పనులు, పంట కాలువలతీత, ఫామ్‌పాండ్స్, ఫిష్ పాండ్స్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.
ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు అప్లోడ్, లబ్ధిదారుల వివరాల నమోదు చేయడం వంటి అదనపు బాధ్యతలు కూడా మోస్తున్నారు. అంతేకాకుండా టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల స్థాయిలో చేయాల్సిన అనేక పనులు కూడా నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా నెలకు రూ.9,800 నుంచి రూ.12,370 వరకు మాత్రమే వేతనం వస్తుండగా, కుటుంబాలను అతిభారంగా నెట్టుకొస్తున్నారు. అరకొర జీతం సరిపోక అప్పుల పాలవుతున్నారు. ఇదే సమయంలో ఉద్యోగ భద్రత లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘మాకు మద్దతివ్వండి.. పేస్కేలు పొందండి’ అంటూ ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నదని.. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయిందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందు పరిచి హామీ ఇచ్చినా.. నేటికీ అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్నా.. ఇరువై ఏళ్లుగా సేవలు అందిస్తున్నా.. తమకు కనీస గుర్తింపునివ్వడం లేదని వాపోతున్నారు. నిరసనలు తెలిపినా.. ఎవరిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేస్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సంక్షేమ సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.