commission | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 22 : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు సీజన్ల నుంచి కమీషన్ పెండింగ్లో ఉండగా, అక్కడ, ఇక్కడ అప్పులు తెచ్చి కొనుగోలు కేంద్రాలు నడిపిస్తే ఏళ్లకేళ్లుగా అప్పులు తీర్చక తడిసి మోపడవుతున్నాయనే ఆందోళన నిర్వాహకుల నుంచి వ్యక్తమవుతోంది. మహిళా సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళు చేయించటం గత దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతున్నది. కొనుగోళ్లు చేపట్టి సంఘాలకు క్వింటాలు చొప్పున కమీషన్ చెల్లిస్తుండగా, గ్రామాల్లో ఏట వంతుల వారీగా స్వయం సహాయక సంఘాలు వివోల ఆధ్వర్యంలో ధాన్యం సేకరించి, పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తున్నాయి.
సీజన్ ముగిసిన అనంతరం కమీషన్ లెక్కించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివో ల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే, గత రెండేళ్ళ నుంచి జిల్లాలో కమీషన్ విడుదల పెండింగ్లో ఉండటంతో, అధికారుల చుట్టూ గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సుమారు రూ.5 కోట్లకు పైగా కమీషన్ విడుదల చేయకపోవటంతో ఎండనకా, వాననకా నెలల తరబడి దుమ్ము, ధూళితో పోటీ పడ్డా తమకు కమీషన్ అందించకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రాబోయే సీజన్లో ధాన్యం సేకరించటంపై పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి కేంద్రాల నిర్వాహకులకు ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సు కింద కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంతో కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించటం, కొనుగోళ్ళకు అవసరమైన యంత్ర పరికరాల పర్చేజింగ్, గన్నీ పంచులు కుట్లు వేసేందుకు అవసరమైన దారం, ఇతరత్రా కొనుగోళ్ళు చేపడుతారు. అనంతరం మొబిలైజేషన్ అడ్వాన్స్ మినహాయించుకుని వారికందించే కమీషన్ చెల్లిస్తారు. అయితే ఈ విధానం ఆటకెక్కగా కొద్ది సీజన్ల నుంచి కేంద్రాల నిర్వాహకులే అప్పు తెచ్చి కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నారు. కమీషన్ వచ్చిన అనంతరం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారు. గత రెండేళ్లుగా కమీషన్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తెచ్చిన అప్పుకు వడ్డీ పెరిగి, తమకు మిగిలేదేమి లేరనే అసంతృప్తి వివోల ప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది.
జిల్లాలో 2023-24 వానాకాలంలో, 3,28,436 క్వింటాళ్ళ ధాన్యం సేకరించగా, రూ.1,05,08,000 కమీషన్ రూపేణా వివోలకు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రూ.73.56 లక్షలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా రూ.31.52 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. అదే ఏడాది యాసంగి సీజన్లో 4,51,528 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయగా రూ. 1, 44,29,000 కమీషన్, 2024-25 వానాకాలం సీజన్లో 2,99,040 క్వింటాళ్ళ ధాన్యం సేకరణకు రూ.95,88 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ఈమూడు సీజన్లలో ఎండింగ్ మొత్తం కలిపి రూ.2,71,49,000 విడుదల చేయాల్సి ఉన్నది. 2024-25 రబీ సీజన్లో జిల్లాలో 7,14,719 క్వింటాళ్ళ దాన్యం కొనుగోలు చేయగా, రూ.2,28,69,000 కమీషన్ చెల్లించాలి. ఈమొత్తం కూడా జమచేస్తే రూ.5,00,18,000 కమీషన్ ధాన్యం సేకరించిన వివోలకు బాకీ పడ్డట్లుగా స్పష్టమవుతున్నది.
హమాలీ చార్జీలు హాంఫట్..!
స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోళ్లు చేసే ధాన్యానికి సంబంధించిన హమాలీ చార్జీలు కూడా రెండేళ్ళ కిందటి వరకు చెల్లించేది. ప్రస్తుతం ఈమొత్తం కూడా రైతులతోనే చెల్లింపులు చేయిస్తున్నారు. ముందుగా హమాలీలకు చెల్లిస్తే, తర్వాత రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్న అధికారులు, ఇప్పటివరకు ఒక్క రైతు ఖాతాలో కూడా హమాలీ చార్జీలు జమ చేయలేదని గగ్గోలు పెడుతున్నారు. ఒక ముందు కూడా చెల్లించే అవకాశం లేదని తమకు అధికారులు ఖరాఖండిగా చెప్పినట్లు రైతులు వెల్లడిస్తున్నారు.
నిధులు విడుదల కాగానే జమ చేస్తాం : రజనీకాంత్, పౌరసరఫరాల శాఖ డీఎం
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము తొందరలోనే బకాయిపడ్డ కమీషన్ విడుదలయ్యే అవకాశమున్నది. ప్రభుత్వం విడుదల చేయగా ఖాతాలో జమచేస్తాం.