ఆ ఐదు గ్రామాల ప్రయత్నం ఫలించింది. సాగు నీటి సంకల్పం సిద్ధించింది. తలాపునే సాగు నీరు పారుతున్నా చుక్కనీటిని వాడుకోని దుస్థితిలో మగ్గిన ఆ రైతుల చిరకాల స్వప్నం మంత్రి ఈశ్వర్ చొరవతో నెరవేరింది. గత ప్రభుత్వాల హయాంలో కనీసం పట్టించుకోని కుమ్మరికుంట ఎస్సారెస్పీ సబ్ కెనాల్ లైనింగ్, తూము విస్తర్ణణ ఏర్పాటు పూర్తయింది. రూ.20లక్షల వ్యయంతో ఇటీవలే నిర్మించి అందుబాటులోకి తేగా, ఇన్నాళ్లూ నీటి కోసం తండ్లాడిన కర్షకుల మోముల్లో ఆనందం కనిపిస్తున్నది.
– జూలపల్లి, జనవరి 16
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల సాగునీటి స్వప్నం నెరవేరింది. కుమ్మరికుంట ఎస్సారెస్పీ-డీ 83 ప్రధాన కాల్వ పరిధిలోని 10 ఎల్ మట్టి ఉప కాల్వ తూము విస్తరణ పూర్తికాగా, రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. జూలపల్లి మండలం కుమ్మరికుంట ఎస్సారెస్పీ-డీ 83 ప్రధాన కాల్వ పరిధిలోని 10 ఎల్ మట్టి ఉప కాల్వ పరిధిలో 500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే సబ్ కెనాల్ తూము చాలా చిన్నగా ఉండడం, ఇంకా కెనాల్ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల కుమ్మరికుంట, ధర్మారం మండలం రచ్చపల్లి, రామయ్యపల్లి, దొంగతుర్తి, కానంపల్లి గ్రామాల్లో చివరి భూములకు ఎప్పుడూ అరకొర నీరే అందేది. సరిగ్గా పంటలు పండక, దిగుబడులు రాక ఏటా ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ఉప కాల్వలో పేరుకుపోయిన మట్టిని తొలగించి శుభ్రంగా చేసుకునే వారు. కాలువను బాగు చేయించాలని గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకోలేదు.
మంత్రి చొరవతో సమస్యకు పరిష్కారం..
ఇలా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం కుమ్మరికుంటలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి, సాగు నీటి కాల్వ అభివృద్ధి కోసం ఎస్సారెస్పీ అధికారులతో చర్చించారు. రూ.20 లక్షలు మంజూరు చేయించి పనులు వేగవంతం చేయించారు. ప్రధాన కాల్వ వద్ద తూము పెద్దగా మార్చి, 344 మీటర్ల పొడవు 10 ఎల్ ఉప కాల్వ సిమెంట్ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి రాగా ఐదు గ్రామాల ప్రజల సంబురపడుతున్నారు. మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మంత్రి కృషి మరువ లేనిది..
ఎస్సారెస్పీ 10-ఎల్ ఉప కాల్వ ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం ఎన్నోఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. చిన్న తూము ద్వారా పంటలకు పూర్తిస్థాయిలో నీరందక నరకం చూశారు. మంత్రి వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించి బాగు చేయించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషి మరువలేనిది.
– మేచినేని సంతోశ్‌రావు, సర్పంచ్, (కుమ్మరికుంట)
రుణపడి ఉంటాం..
ఉప కాల్వ పనులకు నిధులు మంజూరు చేయించి సాగు నీటి గోస తీర్చిన మంత్రి ఈశ్వర్‌కు రుణపడి ఉంటాం. గతంలో ఏ ఒక్కరూ రైతులను పట్టించుకోలేదు. సాగు నీరందుతలేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. కానీ మంత్రి ఈశ్వర్ వెంటనే సమస్యలను పరిష్కరించారు. కుమ్మరికుంట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. – తమ్మడవేని మల్లేశం, ఎంపీటీసీ, (కుమ్మరికుంట)