Indiramma houses | పెద్దపల్లి, జూలై14: ‘మా మండలంలోని చూట్టు పక్కల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతుంది. గ్రామసభలో దాదాపు 88 మంది జాబితా విడుదల చేశారు. కానీ ఇంత వరకు మొదటి విడత అర్హుల జాబితా ప్రకటించలేదు. మీమేం పాపం చేశాం సార్.. మీము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా..?’ అని ప్రశ్నిస్తూ వెంటనే కనీసం మొదటి జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాలకుర్తి మండలం బామ్లానాయక్ తండా గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం, బామ్లానాయక్ తండా గ్రామంలో నూరు శాతం లంబాడీలు(ఎస్టీ) ఉన్నారని, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడుత జాబితా ప్రకటించలేదని వాపోయారు. చుట్టు పక్కన గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతుందని, మా బామ్లానాయక్ తండాలోని ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరగకపోవటాన్ని అవమానంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వంద మంది దాకా దరఖాస్తు చేసుకున్నారని, గ్రామ సభలో దాదాపు 88 మంది అర్హుల జాబితా ప్రకటించినప్పటికీ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వలేదని అవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇందిరమ్మ ఇండ్ల అర్హుల మొదటి జాబితాను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, ఎల్ రజిత, బీ రజిత, ఎన్ రజిత, బీ లావణ్య, బీ సరిత, స్వరూప, స్వప్న తదితరులు పాల్గొన్నారు.