సన్న బియ్యం ఎందుకు సరఫరా చేయలేదు..? అధికారులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపాటు
Minister Adluri | కొత్తపల్లి, ఆగస్టు 11: ‘గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో ఉండిన భోజనం వడ్డించాలని ఉత్తర్వులు విడుదల చేస్తే, ఇక్కడేంటి దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. సన్న బియ్యం ఏమయ్యాయి? మీకెందుకు సరఫరా చేయటం లేదు. బియ్యం సరఫరా చేస్తున్న అధికారులు ఎవరు? ఇక్కడ ఉన్నారా? ప్రభుత్వ ఉత్తర్వులే పట్టించుకోవట్లేదా’ అంటూ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధికారులపై మండిపడ్డారు.
జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం కొత్తపల్లి మండలంలోని చింతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులతో పాటు విద్యార్థులకు పాండాలు బోధిస్తున్న తీరును గమనించారు. మెస్, వంటగది, కూరగాయలు, నిత్యావసరాలు భద్రపరచు గదితో విద్యార్థుల కోసం వండిన వంటలు పరిశీలించారు. దొడ్డు బియ్యంతో వండిన భోజనం విద్యార్థులకు వడ్డిస్తుండటానికి గమనించి అవాక్కయ్యారు.
సన్న బియ్యం భోజనం అందించాల్సి ఉండంగా ఇదేంటి ఇలాంటి భోజనం వడ్డిస్తున్నారు అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించగా, సరఫరా అవుతున్నాయంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. వెంటనే బియ్యం భద్రపరిచిన గదిలోకి వెళ్లి తనిఖీ చేయగా అన్ని బస్తాల్లో దొడ్డు బియ్యం దర్శనమిచ్చాయి. దీంతో ఈ పంపించాలని వీటి స్థానంలో సన్న బియ్యం పంపించాలంటూ ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్స్ స్థలం కబ్జాపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.