వేములవాడ, జనవరి 17: ఎన్నికల ముందు ఆర్ఎంపీలు, పీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వారిని బెదిరింపులకు గురిచేస్తూ స్థానిక సంస్థల్లో గెలుపొందాలని ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులను ఖండిస్తున్నామని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేములవాడ పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 13 నెలలైనా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కనీస సమాచారం లేకుండానే క్లినిక్‌లలో తనిఖీలు, సీజ్ పేరిట భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని ఆరోపించారు. నాంపల్లిలో ఆర్ఎంపీ శ్రీనివాస్ క్లినిక్‌ను కూడా సీజ్ చేసి కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలిసి దాడి జరిగిందా..? సమాచారం లేక జరిగిందో స్పష్టం చేయాలన్నారు.
అధికారులు రాత్రి సీజ్ చేసి ఉదయాన్నే సీల్ తొలగించడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. లేక నాయకులకు తలొగ్గి పనిచేస్తున్నారో..? ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. అన్నింటినీ తెరిచిన అధికారులు నాంపల్లిలోని శ్రీనివాస్ క్లినిక్‌ను ఎందుకు తెరవలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి బాధ్యతగా నడుచుకోవాలని, బలవంతంగా దాడులకు పూనుకుంటే తగిన సమాధానం చెబుతామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు గోలి మహేశ్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, నాయకులు డప్పుల అశోక్, కొండ కనకయ్య, మంతెన సంతోశ్, వెంగల శ్రీకాంత్ గౌడ్, రాజు, కమలాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సందీప్, ప్రేమా చారి, గుండెకర్ల నరేశ్, చీటి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.