తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పంచాయతీ భవనాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. ప్రతి చిన్న పంచాయతీకి సొంత భవనం ఉండాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించి, అనేక భవనాలు నిర్మించింది. ఇంకా కొన్ని చోట్ల నిర్మించాల్సి ఉండగా, ప్రభుత్వం మారిన తర్వాత నిధులున్నా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. కొత్తగా ఏర్పడిన కొన్ని పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఏళ్లనాడు నిర్మించిన శిథిల భవనాల్లోనే మరి కొన్ని పంచాయతీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
పెగడపల్లి మండలం వెంగళాయిపేటలో భవన నిర్మాణానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో రూ. 20లక్షలు మంజూరయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పనులు ప్రారంభమవగా, కొన్ని నిధులు విడుదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు నిలిచిపోవడంతో సంబంధిత కాంట్రాక్టరు పనులను నిలిపివేశాడు.
సారంగాపూర్ మండలం ధర్మరాజ్తండాలో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. అయితే, అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో పనులు మొదలు పెట్టలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024లో పనులు ప్రారంభించగా, పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను పరిపుష్టిగా తయారు చేసేందుకు అనేక ప్రణాళికలు అమలు చేసింది. పంచాయతీలు ప్రజలకు పూర్తి స్వేచ్ఛగా సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాలను పెంచింది. అందులో భాగంగా అనేక కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి వాటితోపాటు శిథిలమవుతున్న పాత పంచాయతీల భవనాల స్థానంలో కొత్త వాటికి మంజూరు ఇచ్చింది. ఇందులో అనేక భవనాలు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేసింది. వివిధ కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయిన పంచాయతీ భవనాలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఏ భవనాల గురించీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పంచాయతీ భవనాలు అనేక చోట్ల పునాది, లెంటల్, స్లాబ్ స్థాయిల్లో నిలిచి పోయాయి. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేక పోవడంతో పట్టించుకునే వారు లేకుండా పోయారు. నిధులున్నా సంబంధిత శాఖ ద్వారా సమీక్షించి పనులు పూర్తి చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం లేదు..
.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఓదెల మండలం కొలనూరు గ్రామంలో బేసిమెంట్ లెవల్లోనే నిలిచిపోయిన గ్రామ పంచాయతీ కార్యాయ భవనం. నిధులు సక్రమంగా అందక మధ్యలోనే నిలిచిపోయింది. ఇలాగే, మండలంలోని గుంపుల, శానగొండ గ్రామపంచాయతీ భవనాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులను విడుదల చేసి నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్ద మొత్తంలో పంచాయతీ భవనాలను మంజూరు చేసింది. 2015-16లో మొదటిసారి 141, మరోసారి 89 భవనాలు మంజూరు చేసింది. 2016-17లో 98 భవనాలను మంజూరు చేసింది. జిల్లా విభజన తర్వాత 2017-18లో ఒకేసారి 257 భవనాలకు ప్రతి భవనానికి 13 లక్షల చొప్పున 33.41 కోట్లు ఇచ్చింది. అందులో కరీంనగర్‌కు 51, సిరిసిల్లకు 44, జగిత్యాలకు 75, పెద్దపల్లికి 39 మంజూరయ్యాయి. మరో 48 భవనాలు విభజిక కరీంనగర్ జిల్లా పరిధిలోని మండలాల పరిధికి వెళ్లాయి. వీటిలో అనేక భవనాలు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న భవనాలపై ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించ లేదు.
ఫలితంగా కొన్ని పంచాయతీలు శిథిలమైన పాత భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తున్నది. కాగా, పెద్దపల్లి జిల్లాలో మూడేళ్ల క్రితం 98 పంచాయతీలకు 19.60 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో 74 చోట్ల పనులు ప్రారంభించగా, 39 పూర్తయ్యాయి. 35 వివిధ దశలో ప్రగతి ఉండగా పలు కారణాలతో మరో 24 పనులు ప్రారంభించలేదు. గతేడాది పాత వాటిని కలుపుకుని మరో 11 కొత్తగా ఎంపిక చేసి మొత్తం 35 భవనాలకు ప్రతిపాదనలు రూపొందించగా నిధులు కేటాయించారు. సకాలంలో బిల్లులు చెల్లించకపో వడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.
పూరాతన భవనంలో విధులు
ఇల్లందకుంట మండలం చిన్న కొమటిపల్లి పంచాయతీ దశాబ్దాల కాలంగా ఇదే భవనంలో కొనసాగుతున్నది. ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితిలో ఉన్నది. కొత్త పంచాయతీ భవనం కోసం రూ.20 లక్షలు మంజూరయ్యాయి. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిధులున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు ఇస్తారో లేదోననే సందేహంతో పనులు చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.