కరీంనగర్, మే 22 (నమస్తే తెలంగాణ) :అకాల వర్షం రైతన్నను ముంచుతున్నది. బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం పడిన వాన తీవ్ర నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు అలాగే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు ఆగమయ్యారు. వర్షాలకు వడ్లు అక్కడక్కడ తడిసి మొలకెత్తగా కన్నీరుపెడుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సుమారు గంటన్నర సేపు పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లెదురయ్యాయి. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మేడిపల్లి, భీమారం మండల కేంద్రాలతోపాటు అన్ని గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, శంకరపట్నం మండలాల్లోని అన్ని గ్రామాల్లో భారీ వాన కురిసింది. రెండు గంటలపాటు ఏకధాటిగా పడడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారీ వాన పడింది. పొత్తూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు మంథని, జూలపల్లి, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్ల కుప్పలు తడిచాయి.