Korutla | కోరుట్ల, ఏప్రిల్ 24: పట్టణ ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య వాహన సిబ్బందికి పొడి, తడి చెత్త వేరు చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ శివారు మెట్పల్లి రోడ్డులోని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న తడి చెత్తతో ఎరువుల తయారీ కేంద్రాన్ని, ఎనిమల్ కేర్ సెంటర్ ను ఆయన గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువు తయారీ కేంద్రంలో ఇంటి నుంచి వచ్చే తడి చెత్తతో పాటు కూరగాయల మార్కెట్ నుంచి సేకరించిన వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసినట్లు చెప్పారు. సేంద్రియ ఎరువు అవసరమైన రైతులు కిలోకు రూ.10 చెల్లించి తీసుకువెళ్లాలని సూచించారు. తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలిరంగు డబ్బాలో వేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, తడి చెత్తను కంపోస్ట్ సెంటర్ కు తరలించి ఎరువుగా తయారు చేస్తామన్నారు. పొడి చెత్తను డీఆర్సీసీ సెంటర్ కు తరలిస్తామని తెలిపారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.