Well done police | ధర్మపురి, ఆగస్టు 13: ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్లప్పుడు ముందుంటామని పోలీస్ యంత్రాంగం నిరూపించుకుంటున్నది. ధర్మపురి గోదావరి నదిలో బుధవారం చిక్కుకున్న భక్తులను ఎంతో బాధ్యతగా ఒడ్డుకు చేర్చిన ఘటన పోలీసుల సేవాభావానికి అద్దం పట్టింది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నుండి గోదావరి నదిలోకి భారీగా నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టు నీటితో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరదనీరు భారీగానే చేరుతున్నది. అయితే బుధవారం గోదావరిలో సాన్నాలకు వచ్చిన భక్తులను అప్రమత్తం చేయడానికి మున్సిపల్, పోలీస్ సిబ్బంది గోదావరి నదికి చేరుకున్నారు. అప్పటికే గోదావరిలోకి స్నానానికి వెళ్లిన భక్తులను ఒడ్డుకు రావాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా గోదావరి నదిలోకి చూస్తుండగానే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భారీగా వరదచేరి గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. భక్తులు ఒడ్డుకు వస్తున్న క్రమంలోనే గోదావరిలో కలిసే వాగు ప్రవాహం కూడా పెరిగింది. భక్తులు ప్రవాహంలో చిక్కుకొని నడవలేని స్థితిలో పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది సాయం అందించారు. ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి భక్తులను ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరగానే గోదావరి నది ఉదృతి మరింతగా పెరిగింది. ప్రాణాలతో బయట పడ్డ సందర్భంగా భక్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.