కాంగ్రెస్ వచ్చాక సంక్షోభంలోకి వస్త్ర పరిశ్రమ
బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి
KCR leadership | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7: కేసీఆర్ నాయకత్వంలోనే సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు నిలిపివేసేందుకు ప్రభుత్వ వస్త్రాల తయారీ ఆర్డర్లు అందించారని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్థాలో పవర్లూం, వార్ఫిన్, వైపని కార్మికులు సోమవారం చేపట్టిన 24 గంటల నేతన్నల దీక్ష శిబిరానికి బీఆర్ఎస్ పట్టణశాఖ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా తనతో ఫోన్లో మాట్లాడి నేత కార్మికుల ఆకలి చావుల నిర్మూలించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం ఆర్డర్లు అందించి కార్మికుల కూలీ రేట్లు పెంచితే ఆకలి చావులు నిలిచిపోతాయని కోరగా వెంటనే కార్మికుల పక్షాన నిలిచి కూలి పెంపునకు చర్యలు చేపట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ఆసాములకు రూ.11, కార్మికులకు రూ.5.25 అందించి ఆదుకున్నారని గుర్తుచేశారు. దాదాపు 8సంవత్సరాల పాటు కార్మికులకు అండగా నిలిచామన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో కూలీ రేట్లు తగ్గించారని, ఆసాములు, యజమానులను కూలీ రేట్ల గురించి అడిగితే తమకు సంబంధంలేదన్న విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆరు నెలల క్రితం కార్మికులను ఆదుకుంటామని, నిత్యం పని కల్పిస్తామని గొప్పలు పలికిని కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లారో కనిపించడం లేదన్నారు. ఆరు నెలలుగా చీరలు ఇస్తామని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వేములవాడలో యారన్ డిపో ఏర్పాటుతో వస్త్ర పరిశ్రమపై భారం పడుతుందన్నారు. కార్మికులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం కూలీ రేట్లు ఎలా తగ్గిస్తుందని ప్రశ్నించారు. శ్రమకు తగిన ఫలితం కార్మికులకు అందాల్సిందేనన్నారు. రైతుబందుకు వేల కోట్లు ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం కనీసం 20కోట్లు కార్మికుల కోసం కేటాయించలేదని అన్నారు. ఆసాములు, కార్మికులు, వైపని కార్మికులకు ఖచ్చితంగా కూలీ రేట్లు ప్రకటించి పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.