గంగాధర, జనవరి 22: ‘మీ వెన్నంటే ఉంటా.. మీ కష్టాలు, కన్నీళ్లలో భాగమవుతా.. ఆపదొస్తే ఆదుకుంటా.. పొద్దుపొడుపుతో మీ ఇంటికి వస్తా.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తా’ అంటూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరువచేయడం, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ఊరూరా త్వరలోనే పొద్దుపొడుపు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బూరుగుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని, 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపించామని వివరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ను స్వయంగా ప్రజల్లోకి తీసకువెళ్లి వివరిస్తానని, తాను నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పా రు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లడం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి కల్యాణలక్ష్మి చెక్కులు, రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తామని వివరించారు.