Lingapur villagers | పెద్దపల్లి, మే 26(నమస్తే తెలంగాణ): ఇప్పటికే సింగరేణి మా గ్రామానికి చెందిన 980 ఎకరాల వ్యవసాయ భూమిని లాక్కుంది. ఇక మా బతుకులకు ఉపాధి హామీ పథకమే ఆధారం… అయితే గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో వీలినం చేస్తే బతుకు బండి సాగటం కష్టం… దండం పెడుతాం సారు… మా పొట్ట కొట్టకండి అని అంతార్గం మండలం లింగాపూర్ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద అందోళన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతి పత్రం సమర్పించారు.
లింగాపూర్ జీపీనా? డివిజనా?
లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు విలీనాన్ని రద్దు చేస్తూ జీపీగా కొనసాగించాలని మరో జీవోను విడుదల చేసింది. ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శిని సైతం నియమించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ జీవో జారీ చేయటంతో గ్రామస్తులు అందోళన చెందుతున్నారు. ఏ చిన్న పనికైనా 16 కిలో మీటర్ల దూరంలోని రామగుండం మున్సిపల్ కార్యాయాలనికి వెళ్లాల్సి వస్తుదని అవేదన చేందుతున్నారు. అంతేకాకుండా మాకు పని కల్పించే ఉపాధి హామీ పథకం పోతుందని… మా పొట్టకొట్ట కండి సారూ అంటూ, గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని కోరుతుతున్నారు.
రోడ్డన పడుతాం.. : వేముల విజయ, లింగాపూర్
మాకు జీవనాధారం ఉపాధి హామీ పథకం.. మా ఊరును మున్సిపాలిటీలో కలిపితే ఉపాధి హామీ పని పోతుంది. ఇక రోడ్డు మీద పడుడే… మా గ్రామాన్ని మున్సిపల్లో కలుపోద్దని అధికారులను, ఎమ్మెల్యేను కలిసినాం. హైకోర్టు దాకా పోయినం. విలీన జీవోను రద్దు చేసే దాకా పోరాటాలు చేసినం. ఎట్టకేలకు రద్దు జీవో రద్దు అయింది. ఇంతలోనే ఎమైందో కానీ మళ్లీ మున్సిపల్ కలుపుతూ జీవో వచ్చిందంటా… మున్సిపల్లో కలిపితే ఇక రోడ్డున పడుడే.
మమ్మల్ని గ్రామ పంచాయతీగానే ఉంచండి.. : నిమ్మరాజుల రవి, గ్రామస్తుడు లింగాపూర్ అంతర్గాం
మా గ్రామం ఇప్పటికే సర్వస్వం కోల్పోయింది. గ్రామం పూర్తిగా గ్రామీణ నేపధ్యంలోనే ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెక్కాడితేనే గానీ డొక్కాడదు. మున్సిపల్ కార్పోరేషన్లో మా గ్రామానికి కలిపి మాకు అన్యాయం చేయవద్దు. గ్రామంగా ఉంచితేనే గ్రామానికి కనీసం ఉపాధి హామీ పథకంతో పాటుగా ఇంటి పన్నులు, ఇతర పన్నులు అన్నీ తక్కువగానే ఉంటాయి. కాదని రామగుండం కార్పోరేషన్లో ఒక డివిజన్లో కలిపితే మాత్రం మా గ్రామానికి పూర్తిగా అన్యాయం చేసన వారు అవుతారు.