ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 28 : మల్కపేట కాలువ పరీవాహక గ్రామాల రైతులు కాలువ నీళ్ల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భరోసానిచ్చారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని, మీ కోసం మీ పక్షాన మేం పోరాడుతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎండిన 9వ ప్యాకేజీ కాలువ, పంట పొలాలను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరితో కలిసి పరిశీలించారు. పదిహేను రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మల్కపేట కాలవకు నీళ్లు వదలాలని విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసినా ఫలితం లేకుండా పోతున్నదని వాపోయారు.
రైతులు ఎండిన పొలాలను చూడలేక పశువులకు మేతకు విడిచిపెట్టిన దుస్థితి ఉందని ఆవేదన చెందారు. రాజకీయాలకతీతంగా రైతు పక్షాన నిలబడి మిడ్‌మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌కు నీళ్లు పంపింగ్ చేయించేందుకు ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు అందె సుభాష్, కొండ రమేశ్‌గౌడ్, నాయకులు నమిలికొండ శ్రీనివాస్, గుగులోత్ పెంటయ్య, అజ్మీరా రాజునాయక్, తిరుపతినాయక్, గోగూరి చంద్రారెడ్డి, భూక్యా ప్రభునాయక్, ద్యాప ఎల్లయ్య, దరావత్ కల్యాణ్, ఆకుల మురళీమోహన్ తదితరులు ఉన్నారు.