Gagireddypalli | చిగురుమామిడి, మార్చి 26: విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్లకుండా బస్సులను బంద్ రాకూండా తీర్మాణం చేస్తామని గాగిరెడ్డిపల్లి సర్పంచ్ సన్నీల్ల కవిత అన్నారు. చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ పాలకవర్గ సభ్యులతో కలిసి గురువారం సందర్శించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ప్రతీ వార్డు సభ్యుడు ఐదుగురు చొప్పున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తీర్మానం చేస్తామన్నారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని, వచ్చే విద్యా సంవత్సరానికి పాలకవర్గం సమిష్టిగా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అందుకుగాను గ్రామంలోని విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా బస్సులను అడ్డుకుంటామన్నారు. ప్రైవేటుకు దీటుగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని సర్పంచ్ ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సన్నిల్ల వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు నరసింహ స్వామి, వార్డు సభ్యులు వెంకటేశం, మంద శ్రీనివాస్, కూన సురేష్, ఉపాధ్యాయులు రవీందర్, ప్రేమలత, అనిత, అనురాధ, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.