Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 26: రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచి లక్ష్మీనగర్ వరకు టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి ఇటీవలనే సిమెంట్ రోడ్డు నిర్మించారు. రోడ్డు తడి ఆరనే లేదు.. అప్పుడే భూగర్భ మంచినీటి పైపులైన్లకు మరమ్మతుల పేరిట తవ్వకాలు చేపడుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘పగిలిపోతున్న మంచినీటి పైపులైన్లు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఈమేరకు సామాజిక కార్యకర్త అశోక్ వేముల స్పందించి శుక్రవారం మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రణాళిక లోపంతో పనులు చేపట్టడం, కొద్ది రోజులకే మరమ్మతుల పేరుతో మళ్లీ నిధులు వెచ్చించడం అంతా కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసమేనా..? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా స్పందించడం లేదని ఆరోపించారు. నెల నెల మున్సిపాలిటీకి ప్రజలు చెల్లించే పన్నులు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికేనా..? అని దుయ్యబట్టారు.
కొత్తగా వేస్తున్న రోడ్లను ఎవరు ధ్వంసం చేసినా రూ.లక్ష జరిమానా వేస్తామని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ మున్సిపల్ అధికారులు కొత్త రోడ్లను తవ్వుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రామగుండం కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకోవడం బాధాకరమన్నారు. అలాగే లక్ష్మీనగర్ లో సైతం కొత్తగా వేసిన రోడ్లు మళ్లీ కంకర తేలుతున్నాయని పేర్కొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్షను కోరారు.