Peddapally | పెద్దపల్లి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లాకేంద్రంలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వివాదం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో న్యాయవాదులు రాజకీయాన్ని తలపిస్తున్నారు. రెండువర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు కోర్టు నిర్మాణంపై ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నారు. శుక్రవారం తాజాగా నూతన అధ్యక్షుడు ఠాకూర్ అజయ్ క్రాంతి సింగ్ నేతృత్వంలో న్యాయవాదులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శీ కోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మాణం పెట్టలేదని, మాజీ అధ్యక్షుడుని తొలగించలేదని కేవలం తాత్కాలికంగా మాత్రమే అధ్యక్షుడిపై ఏడాదికాలం పాటు సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందని వివరించారు. నిబందనలకు విరుద్దంగా సబ్యులకు సరైన సమాచారంలేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలకోసం పనిచేయడం వల్లే మెజారిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, లకిడి భాస్కరుని అధ్యక్ష్య పదవి నుండి తప్పించడం జరిగిందని తెలిపారు.
రాఘవాపూర్ వద్ద కోర్టు నిర్మాణం చేపట్టే తీర్మాణంపై బార్ అసోసియేషన్ సభ్యులెవరు సంతకాలు చేయలేదని, ఆది నుంచి ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నమని స్పష్టం చేశారు. అసోసియేషనుతో సంబందంలేని వ్యక్తులతో సంతకాలు చేయించి అట్టి తీర్మాణాన్ని జిల్లా కలెక్టరుతో పాటు ఇతర అధికారులకు మాజీ అధ్యక్షుడు లకిడి భాస్కర్ సమర్పించారని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఇలాంటి నీచరాజకీయాలకు పాల్పడుతూ కులంకార్డును వాడుతున్నాడని మండిపడ్డారు. తమది న్యాయవాదకులమని అసత్య ప్రచారలు చేస్తే శాశ్వత బహిష్కారానికి గురికావల్సి వస్తుందని శ్రీనివాస్ హెచ్చరించారు.
జిల్లాకేంద్రంలోనే కోర్టు ఉండాలి
జిల్లా కేంద్రంలో యే చోటైనా సరే కోర్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అలా కాదని తమ స్వార్థంకోసం రాఘవాపూరులో కోర్టు ప్రతిపాదనలను అమలుచేస్తే ఎదురిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు రెడ్డి శంకర్, బొంకూరి శంకర్, ఠాకూర్ క్రిష్ణ క్రాంతిసింగ్, మామిడిపల్లి శ్రత్ కుమార్, లవన్ కుమార్, రెడ్డి నర్సింగ్, తాని నరేష్, ఆసరి రమేష్ యాదవ్, ఉద్దెండ నవీన్, పాతర్ల శివ, బోండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.