Aidwa | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేద్కర్, పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర కరీంనగర్ కు గురువారం చెరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్త్రీల సమాన హక్కుల గురించి రాజ్యాంగంలో పొందుపరిచిన మహానీయుడు అన్నారు. స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబమంతా విజ్ఞానులుగా మారుతారని మహిళల విద్యం కోసం పాఠశాలలను స్థాపించి విద్యా నేర్పిన గొప్ప మూర్తి జ్యోతిబాపూలే అన్నారు.
ఈ మహనీయుల ఆశయాల సాధన కోసం మహిళా హక్కుల పరిరక్షణ సాధన కోసం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కృషి చేస్తుందని అన్నారు. దేశంలో సగభాగం ఉన్న మహిళలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని మండిపడ్డారు. లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు తిరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల అఘాయిత్యాలపై కఠినంగా వ్యవహరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పడే హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కఠిన చట్టాలు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. పిల్లలపై ప్రభావం చూపుతున్న పోర్న్ వెబ్సైట్లను మూసివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి మద్యం బెల్ట్ షాపులు మారక ద్రవ్యాల విక్రయాలు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తీసుకురావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమస్యలను అధ్యయనం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. మహిళ ల సమస్యలను పరిష్కరించని యెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాగర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి తిరుపతి, నరేష్ పటేల్, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్య దర్శిలు కే.ఎన్ ఆశలత, నలిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ధ్యావా అన్నపూర్ణ, పాండ్రాళ్ల దేవేంద్ర, నగర కార్యదర్శి చేనిరోజా, సహాయ కార్యదర్శి మంచినీళ్ల లావణ్య, జిల్లా కమిటీ, సభ్యులు ఉప్పునూటి లక్ష్మి, మేదర నాగమణి, టి. భవాని, ఎం. రామ, గొలుసుల రజిని, పోతర్ల మానస, తారపాకల మున్న, అంజలి, పాల్గొన్నారు.