రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : ఆటోడ్రైవర్లకు తాను అండగా ఉంటానని, బీఆర్ఎస్ తరఫున సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్ కట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అప్పుడైనా చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ సర్కారుకు సిగ్గు వస్తుందంటూ దెప్పిపొడిచారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముస్తాబాద్‌కు పార్టీ కార్యకర్త దబ్బెడ రేణుక దేవేందర్, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు నవాజ్, కొండాపూర్‌లో దేవయ్య, రామలక్ష్మణపల్లెలో దమ్మ రవీందర్‌రెడ్డి నివాసాలకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం సిరిసిల్లకు చేరుకుని తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్లు వచ్చి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో స్పందించిన ఆయన ‘అండగా నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉన్నదని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసంఘటిత కార్మికులందరికీ రూ.5 లక్షల బీమా చేయించారని గుర్తు చేశారు.
అందులో ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారని తెలిపారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా ద్వారా డబ్బులు అందాయని చెప్పారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా బీమాను రద్దు చేసిందని మండిపడ్డారు. ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన చెందారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని నిలదీసినా చలనం లేదని విమర్శించారు. ఆనాడు బీజేపోడు.. కాంగ్రెసోడు ఒక్కడు మాట్లాడలేదని మండిపడ్డారు. తాము ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతి ఆటో అన్నకు కాంగ్రెస్ 24వేలు బాకీ
ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ప్రతి ఒక్క ఆటో అన్నకు బాకీ పడ్డ రూ.24 వేలను ముందుగా చెల్లించాలని సర్కారును డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల జీవితాలను నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమవుతుందా..? అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలని సవాల్ చేశారు.
ఫ్రీబస్సుకు మేం వ్యతిరేకం కాదు
ఆటోడ్రైవర్ల సమస్యలు లేవనెత్తితే తమపై దాడి చేస్తున్నారంటూ కాంగ్రెసోళ్లు దబాయిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఫ్రీ బస్సు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచలేదని, దీంతో మహిళలు కొట్టుకునే పరిస్థితి నెలకొందన్నారు. మహిళలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు డబుల్, స్టూడెంట్లకు 25 శాతం చార్జీలు పెంచిందని మండిపడ్డారు. ఇలా అయితే ఫ్రీ బస్సు ఎలా? అవుతుందంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ జిల్లా, పట్టణాధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లె శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ మేమే కట్టిస్తం
మేం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం. మీ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా ప్రభుత్వాన్ని నిలదీసినం. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసినం. మీరు అధైర్య పడొద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్లందరికీ పార్టీ తరఫున ఇన్సూరెన్స్ చేయిస్తం. జిల్లాలో దాదాపు 5వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నరు. వీరికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టడం లేదు. మేమే పార్టీ తరఫున కట్టిస్తం. ఇలా అయినా ప్రభుత్వానికి సిగ్గు వచ్చి, రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లందరికీ బీమా కట్టే ఆలోచన చేస్తుందేమో! అందుకే ఈ కార్యక్రమం మేం చేపడుతున్నం. యూనియన్ నాయకులు జిల్లాలోని ఆటో, ట్రాలీ డ్రైవర్లందరి వివరాలను (పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్) కచ్చితంగా సేకరించాలి. బుధవారం సాయంత్రంలోగా అందించాలి. ఈ లిస్ట్ అందిన వెంటనే మూడు, నాలుగు రోజుల్లోనే బీమా చెల్లింపునకు చెక్కులు పంపిస్త.
– ఆటో డ్రైవర్లతో కేటీఆర్
అధైర్యపడొద్దు.. ఆదుకుంటా

ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన ఆశ కార్యకర్త లత సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి తనగోడు వెల్లబోసుక్నుది. తాను క్యాన్సర్‌తో, తన భర్త రవి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. తమ ఇద్దరి వైద్యానికి సాయం చేయాలని కోరగా, రామన్న సానుకూలంగా స్పందించారు. అధైర్యపడకండి.. ఆదుకుంటానని భరోసానిచ్చారు.