కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 13: పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి నుంచి విరమణ పొంది, బకాయిలు అందక ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో కొవ్వొత్తులతో ఆ సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ, నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రేవా జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడారు. ఏడాది క్రితం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి కడుదయనీయంగా మారిందని, దాచుకున్న డబ్బులు అందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది చనిపోయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇంకా అనేకమంది చావుబతుకుల మధ్య దవాఖానల్లో కొట్టుమిట్టాడుతున్నారని, పెన్షనర్లు చావకముందే వారికి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి గద్దె జగదీశ్వరాచారి, సుంకిశాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, చనిపోయిన పెన్షనర్ల కుటుంబాలకు వెంటనే బకాయిలు చెల్లించాలని, ఎక్స్‌గ్రేషియా కూడా అందజేయాలని డిమాండ్ చేశారు.
పెన్షనర్ల బకాయిలన్నీ ఏకమొత్తంగా చెల్లించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల మరణాల సంఖ్య పెరుగకముందే ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనగా జూబ్లీహిల్స్‌లో తడాఖా చూపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కనపర్తి దివాకర్, ప్రభాకర్, వెంకటరెడ్డి, మహేంద్రరెడ్డి, విశ్రాంత ఉద్యోగులు శ్రీనివాసస్వామి, వెంకటరెడ్డి, చంద్రమౌళి, నర్సయ్య, రవీంద్రకుమార్‌రెడ్డి, రామన్న, రవీందర్, రదీందర్రావు, జాలి మహేందర్‌రెడ్డి, సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.