Chada Venkat Reddy | చిగురుమామిడి, సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని, తెలంగాణ ప్రాంత విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంలో అన్యాయానికి, దోపిడీకి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాగించిన మహోన్నత పోరాటమని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, గునుకులపల్లి, ఓగుళాపూర్, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో అమర వీరుల స్మారక స్తూపాల వద్ద చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారు ప్రసంగించారు. నాటి పోరాటంలో రైతులు, కూలీలు, మహిళలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దొరల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని అన్నారు.
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే నిజాం నవాబుల పరిపాలనలో కొనసాగుతున్న హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదని స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది కమ్యూనిస్టులు పోరాటం చేశారని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలను చైతన్య పరుస్తూ, ఎన్నో సంఘాలను నిర్మించి, నిజాం రజాకారులు, పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారన్నారు. వెట్టిచాకిరీ రద్దు చేయాలని, బానిసత్వం పోవాలని, దున్నేవాడికి భూమి వంటి నినాదాలతో అనేక కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టి ఉప్పెనల ఉద్యమాన్ని నడిపించాలని గుర్తు చేశారు. ఈ పోరాటం, ఈ ఉద్యమంలో 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని ,10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను పేదలకు పంచారని అన్నారు.
కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలు ఉద్యమాలు తట్టుకోలేక నిజాం నవాబు ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగిందని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి కమ్యూనిస్టులు అందించాలని చాడ అన్నారు.నేటికీ రైతులు, కూలీలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజల హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండి నడుస్తారని తెలిపారు.
కరీంనగర్ కమ్యూనిస్టులకు కంచుకోట : పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి
తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో కరీంనగర్ జిల్లా సీపీఐ నేతలు అగ్ర బాగాన నిలిచారని అన్నారు. కరీంనగర్ మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి తో పాటు జిల్లాలో మొట్టమొదటగా అనబేరి ప్రభాకర్ రావు లాంటి ఎంతో మంది నేతలుసాయుధ పోరాటంలో తిరుగుబాటు పోషించారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి పోరాటాలకు కరీంనగర్ పుట్టిన ప్రాంతమని, ప్రజల కోసం జీవించి వారి ప్రాణాలను సైతం త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. వారి లక్ష్యం ఆశయాల కోసం ముందుకెళ్లారని పిలుపునిచ్చారు. మరిన్ని ఉద్యమాలకు సిపిఐ కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, కొయ్యడ సృజన్ కుమార్, న్యా లపట్ల రాజు, కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బోయిని పటేల్, తేరాల సత్యనారాయణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, ఎజ్జ రాజయ్య, సిపిఐ మండల సహయ కార్యదర్శులు బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, సిపిఐ సీనియర్ నాయకులు ముద్రకోల రాజయ్య, గోలి పాపిరెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు ఉస్మాన్ పాషా, ఎల్లయ్య, ఎలగందుల రాజు, చిట్యాల శ్రీనివాస్, అనుబోజు జనార్ధన్, ఇల్లందుల రాజయ్య, కయ్యం తిరుపతి, నీల వెంకన్న, అందే సంపత్, అమరవీరుల కుటుంబ సభ్యులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, కూన భాస్కర్, పెద్దన్న, వేముల కృష్ణ, రాము, గునుకుల సురేందర్ రెడ్డి, చింతపూల రాములు, నరేందర్, సింగిరెడ్డి శంబురెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుర్రం మురళి తదితరులు పాల్గొన్నారు.