యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగా లేక అనేక కష్టాలు అనుభవించామని, మళ్లీ ఆ పార్టీని నమ్మితే కరెంట్ ఖతమైతుందని, ఒకప్పటి లాగానే బాయిలకాడ రాత్రి పూట నిద్రలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మోటర్లకు మీటర్లు పెడితే బిల్లులు కట్టలేక భూములు పడావు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెసోళ్లు చెబుతున్నట్టు రైతులు 10 హెచ్‌పీ మోటర్ కొనే పరిస్థితి ఉంటదా? అని, అంత ఖర్చు ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆపార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, పనికిరాని ముచ్చట్లు చెబుతున్నదని, దానిని రైతులెవరూ నమ్మరని స్పష్టం చేస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు.
– కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మూడు గంటల కరెంటు ఇస్తే కనీసం 30 గుంటలు సాగు చేసే కూరగాయల తోటలకు, పంటలకు కూడా సరిపోదు. 10 హెచ్‌పీ మోటర్లు రైతులకు భారమవుతయి. అంతేకాకుండా కరెంట్ కనెక్షన్లకు ఇండస్ట్రీయల్ సర్వీస్ వైర్లు తీసుకోవాల్సి వస్తది. కెపాసిటీ పెరిగి ట్రాన్స్ఫార్మర్ల మీద భారం పడుతుంది. అవి పేలిపోతయి. గ్రామాల్లో 5 హెచ్‌పీ మోటర్లే సరిగా లేవు. అలాంటిది 10 హెచ్‌పీ ఎలా వాడతరు? ఇది రైతులకు సాధ్యం కాదు. రైతులకు కష్టాలు మళ్లీ మొదలైతయ్. మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నరని ఇయ్యాలే తెలిసింది. కాంగ్రెస్, బీజేపీని ఇంక నమ్ముతమా..? ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటిస్తున్నది. రైతులకు కావల్సినంత భూగర్బ జలాలున్నయి. దీంతో ఎవుసం సక్కగా సాగుతున్నది. మళ్ల కేసీఆరే రావాలి. ఆయనొస్తనే తెలంగాణ పచ్చగుంటది.
– తోట రమేశ్, గోపాల్పూర్ (కరీంనగర్ రూరల్)
పాతపద్ధతి రెవెన్యూ వ్యవస్థ వస్తే మళ్ల ఇబ్బందులు తప్పయి. మళ్లీ రికార్డులు పాత పద్ధతిలోకే వెళ్తే రెవెన్యూ వ్యవస్థలో తప్పులు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసోళ్లు మళ్ల పాతది తెస్త అంటున్లు. అట్లయితే దళారుల రాజ్యమొస్తది. ధరణి పోర్టల్‌లోనే రెవెన్యూ వ్యవస్థను కొనసాగించాలి. ధరణి వచ్చిన తరువాతే పేదల భూములకు రక్షణ ఉంది. ఆన్‌లైన్‌తో మోసాలు తగ్గిపోయినై. ఎప్పుడు చూసినా మన భూమి వివరాలు కండ్ల ముందే ఉంటయి. ధరణి పాసుబుక్‌తో సెల్ నెంబర్ జత చేయడం వల్ల మోసం చేయడానికి అవకాశం లేదు. రైతుల వేలి ముద్రలతోనే రికార్డులు ఓపెనవుతయి. మరొకరి పేరు పైకి మార్చే పరిస్థితి లేదు. మనకు సంబంధించిన వివిధ సర్వే నంబర్లలోని భూమి రికార్డులు ఒకే పాసు పుస్తకంలో రికార్డు కావడంతో, పహాణీలలో మన రికార్డులు భద్రంగా ఉంటయి. ఇంత మంచి ధరణి జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
-గుజ్జుల లక్ష్మారెడ్డి, గుజ్జులపల్లి(కరీంనగర్ రూరల్)
కరీంనగర్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌కు ఓటేస్తే బతుకు దెరువు కరువైతదని, పదేండ్ల కిందటి చీకటి రాజ్యం మళ్లీ వస్తదని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కరెంట్ విషయంలో రైతులు పడిన కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఇచ్చిన కరెంట్‌తో పంటలు పండక నష్టపోయిన తీరును ఇప్పుడు గ్రామాల్లో రచ్చ బండల వద్ద చర్చకు పెడుతున్నారు. రాత్రి పూట కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు అర్ధరాత్రి, అపరాత్రి బాయిల వద్దకు వెళ్తే ఎదురైన భయంకర అనుభవాలను మర్చిపోలేక పోతున్నామని చెప్పుకుంటున్నారు.
రాత్రి పూట బావుల వద్దకు వెళ్తే పాములు, కరిచి, గుడ్డెలుగుల దాడులకు గురై, ఆఖరికి కరెంట్ షాక్‌లతో చనిపోయిన రైతులను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కుటుంబాలు పడుతున్న బాధలను చూసి చలించి పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మూడు గంటల కరెంట్ ఇస్తామని చెబుతుండటంతో రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి పార్టీకి అధికారం ఇస్తే నిజంగానే మూడు గంటల కరెంట్ ఇస్తుందనే భయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కరెంట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను గుర్తు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే బతుకుదెరువు ఖతమైతదని, బాయిల కాడ నిద్రలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటర్లకు మీటర్లు పెడితే భూములు పడావు పెట్టుడేనని చెబుతున్నా. రాష్ట్రంలో ఏ రైతైనా 10 హెచ్‌పీ మోటర్ కొనే పరిస్థితి ఉందా? అని, అంత పెద్ద మోటర్లు, వాటికి అవసరమయ్యే పైపులకు ఖర్చు ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చేదు లేదు.. సచ్చేది లేదుగానీ, పనికిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నదని, ఆ పార్టోళ్లను ఎవరూ నమ్మరని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు పొద్దంతనే అవసరం ఉన్నప్పుడే వెళ్లి కట్క నొక్కితే కరెంట్ వస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్‌కు ఓటేస్తే తెర్లవుతామనే వాదనలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంల మేం అనుభవించిన చీకటి రోజులను ఇప్పటికీ నేను మరచిపోలే. తాడిజెర్రిలో నాకు మూడెకురాల ఎవుసం భూమి ఉంది. అప్పటి కాంగ్రెస్ సర్కారు 9 గంటల కరెంటు ఇస్తున్నమని చెప్పి కనీసం 3 గంటలు కూడా సక్కగ ఇచ్చిన పాపాన పోలే. ఏ అర్ధరాత్రో కరెంటు ఇచ్చెటోళ్లు. పొలం ఎండిపోకుండా నీళ్లు పెట్టుకుని కాపాడుకోవాలె కాబట్టి కష్టమైనా పొలం వద్దకు వెళ్లేవాళ్లం. రాత్రంతా జాగారం చేసి అరకొరగా వచ్చే కరెంటుతోని పొలానికి పారించడానికి నానా తంటాలు పడెటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ సర్కారు 24 గంటల కరెంటు ఇస్తంది. నాకు ఇష్టమచ్చిన టైంల పొలానికి నీళ్లు పెడుతున్న. సర్కారు అంటే కేసీఆర్ సర్కారు లెక్క ఉండాలె.
– గుండ్రెడ్డి రామిరెడ్డి, వెంకటాయపల్లి(గంగాధర)
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటుతో ఎలాంటి రంది లేకుండా పంటలకు నీరు ఇస్తున్నం. మూడు గంటల కరెంటుతో మూలకూడా తడవదు. వ్యవసాయం బందు చేసుకోవాల్సిందే. గత ప్రభుత్వాలు ఇచ్చిన కరెంటుతో ఎన్నో తిప్పలు పడ్డాం. కరెంటు కోసం మోటర్ల దగ్గర పడుకొని, రాత్రి, పగలు కాపలా కాస్తు నీరు పెట్టినం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొమ్మిది సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండిస్తున్నం. రైతులు సంతోషంగా ఉన్నారు. మూడు గంటలు కరెంటు ఇస్తమంటున్న కాంగ్రెస్ వద్దే వద్దు. రైతుల కష్టాలు తీర్చే బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతిస్తాం.
– కామెర రేణుక, రైతు, మన్నెంపల్లి (తిమ్మాపూర్ రూరల్)
కాంగ్రెసోళ్ల చెబుతున్న మాటలు నమ్మి ఓటేస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. రాత్రిపూట పొలాలకు పోవాల్సిన పరిస్థితి వస్తది. మూడు గంటల కరెంటు చాలంటున్న రేవంత్ రెడ్డికి రైతుల సమస్యలు తెలియవు. నాటి కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరిగా లేక పంటలు పండక రైతులు అప్పుల పాలయిన్రు. టెన్ హెచ్‌పి మోటర్లు కొనాలని చెప్తున్నాడు. వాళ్ల మాటలు వింటే రైతులు వ్యవసాయం చేయలేరు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతంది. మేమంతా కేసీఆర్‌కు ఓటేస్తాం.
– గడ్డం అనిల్ రైతు, రేకొండ, చిగురుమామిడి
మన దగ్గర 10 హెచ్‌పీ మోటర్లతోని వ్యవసాయం చేసేటోళ్లు లేరు. ఆ మోటర్లు వాడితే నారు వేసినప్పుడు వరి నారు కొట్టుకపోతది. అంత పెద్ద మోటర్లతో కరెంటు సరిపోక మన దగ్గరున్న ట్రాన్స్ఫార్మర్లు లోవోల్టేజీ సమస్యతో ఎక్కడికక్కడ కాలిపోతయ్. మోటర్లు రిపేరుకొస్తయి. ఇప్పటి కాలంల మూడు గంటల్లో పంటకు నీరందుతదా..? రైతులు ఇబ్బంది పడాల్సి వస్తది. ఇవన్నీ వ్యవసాయంపై అవగాహన లేనోళ్లు చేసే పని. ఆ కాంగ్రెసోళ్లకు ఎద్దు ఎరకనా.. ఎవుసం ఎరుకనా.. అందుకే గిసొంటి మాటలు మాట్లడుతుండ్లు. గిట్ల చేస్తే వాళ్లను బొంద పెట్టుడు ఖాయం. అయిన ఇప్పడు కేసీఆర్ అందిస్తున్నట్లు రోజు 24 గంటల కరెంటు మంచిగుంది. ఇవన్నీ చూస్తున్నం కదా.. అయిన ఎవరేం చెప్పినా వినిపించుకోం. మాకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇస్తూ ఆసరా అవుతున్న కేసీఆర్‌కే అండగా ఉంటం.
– పెండ్యాల కెశవరెడ్డి, గుజ్జులపల్లి (కరీంనగర్ రూరల్)
రైతులకు ఇప్పుడు ఫైవ్ హెచ్‌పీ మోటర్లు సరిపోతున్నయ్. 24 గంటల కరెంటుతో పంటలకు ఏ ఇబ్బంది లేకుండా నీరు అందుతంది. టెన్ హెచ్‌పీ మోటర్లు పెడితే బావుల్లోని నీళ్లు రెండు గంటల్లో ఖాళీ అవుతాయి. అలాగే టెన్ హెచ్‌పీకి రూ.70 వేల ఖర్చు అయితది. సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయానికి కరెంట్ అందుతంది. రైతులు ఆర్థికంగా బాగుపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్లు మాయమాటలతో మోసం చేస్తున్నారు. రైతులతో చెలగాటమాడుతున్నరు. వారిని నమ్మం. మళ్లా బీఆర్ఎస్నే గెలిపించుకుంటం.
– గందె సంపత్, రైతు, సుందరగిరి (చిగురుమామిడి)
ఎవుసం గిప్పుడుగిప్పుడే సెట్ అయితంది. గిప్పుడు కాంగ్రెసోళ్లకు ఎవలన్న కరెంటు ఎక్కువైంది. చేంజ్ చేయాలని చెప్పిన్ర. మూడు గంటలేం సరిపోతది. ఈ ఏడేనిమిదేండ్ల సంది మంచిగ నీళ్లు పారిచ్చుకుంటన్నం. గిప్పుడు మల్ల మూడుగంటలు సరిపోతది. పెద్ద మోటర్లు పెట్టుకోవాలంటే ఏంది కథ కొద్దిపైసలైతయా. మల్ల బాయిలకాడ పండేటట్టు చేసేటట్టు ఉన్నరు ఆళ్ల రాజ్యం అత్తే.
-ఎడ్ల తిరుపతిరెడ్డి, మన్నెంపల్లి (తిమ్మాపూర్)
కాంగ్రెస్ విధానాలు చూస్తుంటే రైతులు సంతోషంగా ఉండటం ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నం. ఈ సమయంల రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే మళ్లీ కష్టాలు మొదలైతయ్. కాంగ్రెసోళ్ల పిడుగులాంటి వార్తతో నిద్ర కూడా సక్కగ వస్తలేదు. పాత రోజులను తలుచుకుంటునే భయమేస్తోంది. అప్పుడున్న కరెంట్ కష్టాలతో రైతులు వ్యవసాయం చేయడానికి కూడా వెనుకడుగు వేసిన్రు. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు.. నీళ్లు ఉంటే కరెంట్ రాకపోవు. రైతులకు మేలు చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ అని చెప్పి కీడును చేసేలా ఉన్నరు. ఒక్క రైతు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయడు. ఇది నిజం.
– ఎస్ కనుకయ్య, కొండాపూర్, కొత్తపల్లి
10 హెచ్‌పీ మోటర్లతో రైతులకు లక్షల రూపాయల ఖర్చయితది. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అనడం చూస్తే వారికి ఎవుసంమీద ఏ మాత్రం అవగాహన లేదని అర్థమైతంది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. 10 హెచ్‌పీ మోటర్లతో ఒకసారిగా లోడ్ పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి మళ్లీ పంటలు ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వేళాపాల లేని అరకొర కరెంట్‌తో తరచూ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఎంతో గోస పడ్డం. ఒకవేళ మోటరు కాలిపోతే పది వేల ఖర్చయితది. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతోనే రైతులకు మేలు. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు 10 హెచ్‌పీ మోటరు పెడితే బాయిల నీళ్లు తొందర ఖాళీ అయితయ్. కరెంట్ భారం పడుతది. దానిని తిరిగి రైతులపైనే వేస్తరు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, రైతులను మళ్లీ గోసపెట్టాలని చూస్తున్నది. అలా చేస్త ఆ పార్టీని తరిమికొట్టాల్సి వస్తది. రైతుల పక్షాన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటం.
-మునిగంటి శ్రీధర్‌రెడ్డి, రైతు, (పరకాలక్రాస్ రోడ్, హుజూరాబాద్‌టౌన్)
గతంలో కరెంట్ ఇబ్బందులు చాల అనుభవించనం. రోజుకు మూడు గంటలు ఇస్తే, కనీసం 3 ఎకరాల కూడా సాగదు. ఇప్పుడు గ్రామంలో నడుస్తున్నయన్నీ 3 హెచ్‌పీ మోటర్లే. నీళ్ల పారకం దూరముంటేనే రైతులు 5 హెచ్‌పీ మోటర్లు వాడతరు. చివరికి మామిడితోట, వంటి వాటికి సైతం 7 హెచ్‌పీ మోటర్లు వాడతలేరు. 10 హెచ్‌పీ అయిత డబుల్ స్టాటర్లు తెచ్చుకోవాలి. కెపాసిటీ పెంచి కనెక్షన్లు తీసుకోవాలి. పైపులు మార్చలి. మస్తు ఖర్చు అయితది. రైతుల గివన్నీ చేస్తరా.. ఇవన్నీ అయ్యే పనేనా.. మూడు గంటలు, 10 హెచ్‌పీ మోటర్లు అంటే వ్యవసాయం అంటే తెలవనోళ్లు మాట్లాడే మాటలు. కాంగ్రెసోళ్లకు తలెర్కనా.. తోకెర్కనా.. అయినా ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న కరెంటు మంచిగుంది. మళ్ల ఎనుకటి లెక్క సేతమనుడు ఏంది. నాడు అరిగోస పెట్టిన కాంగ్రెస్ మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెబుతున్నది. అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు కానీ, రైతులను ఆగం చేస్తున్నది.
– కొల్లూరి మల్లారెడ్డి, చెర్లభూత్కూర్ (కరీంనగర్ రూరల్)