Koppula Eshwar | ధర్మారం, ఆగస్టు 29: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం పార్టీ నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పార్టీ ముఖ్య నాయకులతో ఈశ్వర్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామాల వారిగా నాయకులతో మాట మంతి నిర్వహించారు. గ్రామాలలో పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనే విషయంపై వారితో ఆయన చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజల అభ్యున్నతి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఐక్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రజలలో ఇప్పటికీ బీఆర్ఎస్ పై ప్రగాఢమైన నమ్మకం ఉందని, ఈ క్రమంలో ప్రజలతో ఇప్పటినుంచి మమేకమైతే పార్టీకి విజయం వరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకు పార్టీ నాయకులంతా ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా కలిసికట్టుగా నడవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు గడపగడపకు వివరించాలని ఆయన సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ గ్రామాన నాయకులు సంసిద్ధులు కావాలని ఆయన సూచించారు. అదేవిధంగా గ్రామపంచాయతీలలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పొరపాటున తొలగించిన ఓటర్ల గురించి అధికారుల దృష్టికి తీసుకువచ్చి సరిదిద్దే ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకులకు సూచించారు. ఆ దిశగా అందరి దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.