KARIMNAGAR BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సంబరానికి గులాబీ శ్రేణులు చీమల దండులా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్యక్షతన మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మండలంలో మూడువేల మందికి తగ్గకుండా ఎల్కతుర్ర్తి మండల కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కావాలని సూచించారు. ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చాడని, సాగు, తాగునీరు, ఉచిత కరంటు, రైతు బీమా, రైతు బంధు, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు.
కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. కేసీఆర్ మహాసభకు 40 లక్షలకు పైచిలుకు కార్యకర్తలు హాజరు కానున్నారని అన్నారు. కేసీఆర్ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మండలంలో 50 బస్సులకు తగ్గకుండా గ్రామాల వారీగా ఏర్పాటు చేస్తున్నారని, గులాబీ శ్రేణులు స్వచ్ఛందంగా కేసీఆర్ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీలు కొత్త వినీత, ఆకవరం భవాని, జిల్లా నాయకులు సాంబారి కొమురయ్య, మండల నాయకులు రామోజు కృష్ణమాచారి, ఆకవరం శివప్రసాద్, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవినీతి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై మంత్రి చర్యలు తీసుకోవాలి
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ కమిటీలో జరిగిన అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో పాటు బాధ్యులైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు కొత్త వినీత, ఆకారం భవాని, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య డిమాండ్ చేశారు. విలేకరులతో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అధికారుల పనితీరు బాగోలేదని అన్నారు. చిగురుమామిడి వ్యవసాయ శాఖలో అవినీతి చోటుచేసుకుందని వాటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు.