Chada Venkat Reddy | చిగురుమామిడి, డిసెంబర్ 19: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు మరింత పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, ఓడినంత మాత్రాన కృంగిపోకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ ఎన్నికలు సీపీఐ పార్టీకి నిరాశ కలిగించాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్య ఉండి ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పట్టిష్టపరచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గెలిచిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో పార్టీని మరింత బరోపితం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న చిగురుమామిడి మండలంలో ఒక్క స్థానం దక్కించుకోకపోవడం బాధాకరమైనప్పటికీ పార్టీని మరింత పట్టిష్టపరిచేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి, నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, బూడిద సదాశివ, బోయిని పటేల్, తేరాల సత్యనారాయణ, ములుకనూరు ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, నాయకులు అందె సంపత్, తిరుపతి, విజయ, చొక్కయ్య, సౌందర్య, అనిల్, అన్ని గ్రామాల కార్యదర్శిలు, నాయకులు పాల్గొన్నారు.