MLA CH Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 15 : ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని సబ్బితంలో శుక్రవారం పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రూ.54 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నివాస భవనాలను ప్రారంభించి గృహ ప్రవేశ పూజలు చేశారు.
అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో స్థానిక నాయకుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూనే ఇక ముందు అలా జరుగకుండా చూసుకోవాలని అర్హులందరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులుంటే నా దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలు పరిష్కరించేలా చూస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవొ కొప్పుల శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాధురీ, ఎఫ్ఆర్వో సతీష్ కుమార్, అమీనోద్దిన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్, మాజీ ప్రజా ప్రతినిధులు నూగిళ్ల మల్లయ్య, ఆడెపు వెంకటేశం, గంట రమేష్, కలబోయిన మహేందర్, చంద శంకర్, కందుల అశోక్, బండారి రామ్మూర్తి, ముత్యాల నరేష్, ఇండ్ల రమేష్, నూనే రమేష్ తదితరులు పాల్గొన్నారు.