గంగాధర/ బోయినపల్లి రూరల్, అక్టోబర్ 30 : తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన చొప్పదండి నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. మొదట గంగాధర మండలం గట్టుభూత్కూర్ కొనుగోలు కేంద్రంలో.. ఆ తర్వాత తడగొండలో కొనుగోలు కేంద్రాలను తడిసిన ధాన్యాన్ని పరిశీలించి చలించిపోయారు. సకాలంలో కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతోనే రైతులు పడిగాపులు గాయాల్సిన దుస్థితి వచ్చిందని, తుపాన్ ప్రభావంతో ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, విపత్కర పరిస్థితుల్లో ధైర్యమిచ్చారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు భరోసా కరువైందని వాపోయారు. పంటలు నష్టపోయి రైతులు కన్నీరు పెడుతున్నా మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. గట్టుబూత్కూర్లో ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, రామిడి సురేందర్.. బోయినపల్లి మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నాయకులు ఉన్నారు.