Environmental protection | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 18: పర్యావరణ పరిరక్షణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విత్తన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విత్తన గణపతులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగంతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణo పాడవుతుందని అన్నారు.
మట్టితో తయారు చేసిన విత్తన వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు తెలంగాణలో వృక్ష సంపదను పెంపొందించడంలో భాగస్వాములు అవుతామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కుంబాల మల్లా రెడ్డి, కోడి అంతయ్య, కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.