Ponnam Prabhakar | చిగురుమామిడి, మే 22: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణ సన్నాక సమావేశంలో గురువారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, అనంతరం 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 కు గ్యాస్, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.
స్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పునర్వ్యవస్థీకరిస్తూ మండల సమావేశాలు ఏర్పాటు చేస్తామని, శాసనసభలో తనను గెలిపించినందుకు పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ తెచ్చినందుకు నాయకులకు, మండల ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, ఆరోగ్యశ్రీకి రూ.పది లక్షల వరకు చికిత్స, 60,000 ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. రెండు నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో 4.50 లక్షలు ఇండ్లు చేసినట్లు చెప్పారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, సాగునీటి సమస్య లేకుండా పరిష్కరించామన్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు హైదరాబాద్ కు వస్తే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, . ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి సూచించారు. మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి మండల, గ్రామ, అధ్యక్షులకు దరఖాస్తులకు పీసీసీ పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి, నమిళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా, మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న, జిల్లా నాయకులు చిట్టిమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.