Vemulawada | వేములవాడ, మే 1 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయం అయినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రమే ఉండగా ఐరావతం లాంటి వేతనాన్ని భరించలేమని ఈ అధికారి మాకద్దు అంటూ వెనక్కి పంపిన తీరు ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీమాంశంగా మారింది. ఆగస్టు మాసం 2025 లో రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాద్రి, బాసర, కొండగట్టు, కొమరవెల్లి దేవాలయాలను యూనిట్ గా చేసి ఈ ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల్లో భాగంగా దేవాదాయశాఖ బదిలీ చేసింది.
అయితే వేములవాడ రాజన్న ఆలయం నుండి బదిలీ సమయంలో పర్యవేక్షకుడిగా ఉన్న ఒక ఉద్యోగిని బాసర ఆలయానికి బదిలీ చేశారు. అంత దూరం వెళ్లి విధులు నిర్వహించే ఉద్దేశం లేకపోవడంతో సదరు ఉద్యోగి కొంతకాలం తమ విధులకు గైర్ హాజరవుతూ వచ్చారు. ఇక సదరు ఉద్యోగి రావడం లేదని దేవాదాయ శాఖకు లేక రాయడంతో తిరిగి ఉద్యోగంలోకి వచ్చారు. అయితే ఇటీవలే ఆయనకు మాతృ సంస్థ వేములవాడ రాజన్న ఆలయంలో ఏఈవో గా పదోన్నతి లభించింది. మాతృ సంస్థలో పదోన్నతి పొందినప్పటికీ విధి నిర్వహణలో ఉన్న సదరు బాసర దేవాలయానికి వెళ్లి ఉద్యోగ బాధ్యత నిర్వహించాల్సి ఉంది.
ఆదాయం అంతంతే.. ఉన్నది 17 మంది ఉద్యోగులే..
వేములవాడ రాజన్న ఆలయంలో ఏఈవో గా పదోన్నతి పొందిన సదరు అధికారి బాసర ఆలయంలో విధి నిర్వహిస్తుండగా ఈ సదరు అధికారి తమకు వద్దంటూ దేవాదాయ శాఖకు అక్కడి అధికారులు ప్రతిపాదన చేశారు. ఇక బాసర ఆలయానికి దాదాపు ఏడాదికి రూ.17 కోట్ల ఆదాయం ఉండగా మొత్తం ఉద్యోగులు కూడా 17 మంది ఉన్నారు. ఇక సదరు ఏఈవో కు ఏకంగా నెలకు దాదాపు రూ.లక్షా 40 వేల వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఆ శాఖ దగ్గర ఆదాయమే అంతంత మాత్రం, క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం అధికారి స్థానం ఖాళీ లేకపోగా, పైగా ఐరావతం లాంటి వేతనం చెల్లించలే మహాప్రభు అంటూ అక్కడి ఆలయ అధికారులు దేవాదాయశాఖ మొరపెట్టుకున్నారు. దీంతో చేసేది ఏమీ లేక సదరు అధికారిని తిరిగి వేములవాడ ఆలయానికి వెళ్లి విధులు నిర్వహించాల్సిందిగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా నేడో రేపో ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉంది.