
Konaraopeta | కోనరావుపేట, జూన్ 27 : ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించాల్సిన గ్రామపంచాయతీ అధికారి (జీపీవో) తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో జీపీవోగా విధులు నిర్వహిస్తున్న సిలివేరి ప్రవీణ్ వద్దకు విద్యార్థులు, నిరుద్యోగులు సర్టిఫికెట్ల సంతకాల కోసం వెళ్లితే అనవసరపు ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రైతులు, మహిళలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వెళ్లినా సరైన స్పందన లభించడం లేదని ఆరోపించారు.
పలుమార్లు జీపీవో పనితీరుపై గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని, ప్రజాప్రతినిధుల సూచనలను కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జీపీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి బదులుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడే వ్యవహర శైలి కూడా సరిగా లేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన గ్రామస్తులు తహసీల్దార్ వరలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారిని వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.