Free Bus Service | వేములవాడ, జూలై 13 : ఫ్రీ బస్సు తో ప్రయాణాలు పెరిగిపోయి గొడవలకు దారితీస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సీఎం రేవంత్ రెడ్డి అభిమాని వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో బాధితురాలు రజిత ఆవేదన వెళ్లగక్కింది. ఆమె మాటల్లో.. ‘ఫ్రీ బస్సు తో మాలో మాకే గొడవలవుతున్నాయి. నేను సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాన్, మంత్రి సీతక్కతో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.. నేను కాంగ్రెస్ కార్యకర్తనే..’ అని నిజామాబాద్ జిల్లాకు చెందిన రజిత అనే మహిళ వేములవాడలో సోమవారం ఆవేదనతో మాట్లాడింది. ఫ్రీ బస్సు కాంగ్రెస్ పార్టీ మీదే మహిళలకు విరక్తి కలిగి ఉన్న అభిమానం కాస్త పోతుందని వాపోయింది.
‘ప్రయాణానికి అయితే ఆఫ్ టికెట్ పెట్టండి, లేదంటే ఫుల్ టికెట్ పెట్టండి.. కానీ ఫ్రీ బస్ తో ప్రయాణాలు పెరిగి మహిళల మధ్య గొడవలకు దారితీసి ప్రాణాల మీదికి వస్తుందని..’ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త శ్రావణ్ తో కలిసి వేములవాడ రాజన్న సన్నిధికి స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్లే క్రమంలో సీట్ల కోసం జరిగిన గొడవలో తీవ్ర గాయాలు కాగా ఆమె ఫ్రీ బస్ పై మాట్లాడారు. సీట్ల కోసం దస్తీలు, వాటర్ బాటిల్ పెట్టి ఆక్రమిస్తున్న తీరు సరిగ్గా లేదని, దీంతో గొడవలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ‘మీరు ఏమనుకున్నా పర్వాలేదు.. నన్ను క్షమించండి.. ఫ్రీ బస్సు మాత్రం వద్దు..’ అని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.