Vemulawada | వేములవాడ, ఆగస్టు 1 : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉపాధి లేక ఆటో వాహనాలకు తెచ్చిన అప్పులు కట్టలేక భార్యల మెడలోని పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆగస్ట్ 1వ తేదీని ఆటో కార్మికుల దినోత్సవంగా జరుపుతుండగా శనివారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాంటి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆటోలకు ఉపాధి లేకుండా పోయి చేసిన అప్పులు కట్టేందుకు భార్యల మెడలోని పుస్తెలు (తాళిబొట్టు) కట్టాల్సి వస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్ లో 1800 మంది ఆటో కార్మికులు ఉండగా వీధిన పడిన కుటుంబాలలో 23 మంది ఆటో కార్మికులు మృతి చెందారని ఆవేదనతో వ్యక్తం చేశారు.
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆర్టీసీలకు అనుసంధానంగా ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఇప్పటికే వీధిన పడిన మేము ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే తప్పనిసరిగా నిరసన తప్పదని ఆయన అన్నారు. దాదాపు ఆటో మీది ఆధారపడి పదివేల ఓటర్లు ఉంటారని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. వేములవాడ లాంటి పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో అంతంత మాత్రం గానే వారానికి మూడు రోజులు మాత్రమే ఇక్కడ పని ఉంటుందని మిగతా చోట్ల అది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలను తెచ్చే ఆలోచన ఉంటే విరమింప చేసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తో పాటు అధికారులకు వినతి పత్రం అందజేసి కోరుతామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనికి తగ్గకపోతే నిరసన తప్పదని ఆయన పరోక్షంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సిరిసిల్ల జిల్లా ఆర్టీవో శ్రీనివాస్, వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.