కరీంగనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం మత ఘర్షణల పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. నగరంలో బీరప్ప కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
బండి సంజయ్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల మూలంగా శాంతియుతంగా ఉన్న తెలంగాణలో అశాంతి నెలకొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండడంవల్లే అనేక కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
గుజరాత్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతలు సక్రమంగా లేకపోవడం వల్ల పరిశ్రమలు రమ్మన్న రావటం లేవని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడులు, మసీదులు ధ్వంసం చేసేందుకు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం తవ్వకాలు చేపట్టాలని హితవు పలికారు.