తిమ్మాపూర్, జూన్22: రైతన్న పై వానలు పగపట్టాయి. వర్షాకాలం ప్రారంభంలో అనవసర సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి మురిపించిన వానలు.. నేడు జాడ లేకుండా పోయాయి. ఎర్రని ఎండల్లో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వర్షాలు పడి ఇబ్బందులకు గురిచేసిన వానలు.. నేడు చుక్కదిక్కు లేక రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మక్క చేనులు, పత్తి పంటలు వానలు లేక మొలకెత్తి ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. దీంతో చాలా గ్రామాల్లో స్ప్రింక్లర్ల ద్వారా, డ్రిప్ పైపులు, కాలువలు చేసి నీటిని అందిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వానమ్మ వచ్చి పోవమ్మా అంటూ దేవుని మొక్కుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి శివారులో మొండయ్య అనే రైతు తన మూడెకరాల పత్తి పంటను కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి నీటిని అందిస్తూ వర్షాలు పడే వరకు పంట బతికుండేలా చేసుకుంటున్నాడు.