పెద్దపల్లి, ఆగస్టు 29: వృద్ధాప్యంలో ఉన్న తండ్రి బాగోగులు చూసుకోని కారణంగా కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొడుకు, బిడ్డ కలిసి ప్రతి నెలా 10 వేలు జమ చేయాలని ఏకంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్వర్వులు జారీ చేశారు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల పోషణను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తమ సంతానంపై ఉంటుందని స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ధర్మారం మండలం పైడిచింతలపల్లికి చెందిన గడ్డం బాపురెడ్డికి ఒక కొడుకు స్వామిరెడ్డి, ఒక కూతురు ఉన్నారు.
ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. గతంలోనే తన పేరుపై ఉన్న ఆరెకరాల 5 గుంటల భూమిని కొడుకు స్వామిరెడ్డికి దాన సెటిల్మెంట్ (గిఫ్ట్ డీడ్)ను చేశాడు. తర్వాత కొడుకు గ్రామంలోనే వేరుగా ఉంటున్నాడు. బాపురెడ్డి భార్య చనిపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. కొంత కాలంగా కొడుకు తన బాగోగులు చూసుకోవడం లేదని గతంలో పెద్దపల్లి ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. స్వామిరెడ్డిని పిలిచి కౌనెల్సింగ్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతో బాపురెడ్డి తిరిగి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు.
తన కొడుక్కు బదిలీ చేసినటువంటి గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని అందులో పేర్కొన్నాడు. దాంతో కలెక్టర్ తండ్రీ కొడుకులను పిలిపించి, విచారణ చేపట్టారు. తండ్రిని నిర్లక్ష్యం చేసినట్టు తేలడంతో బాపురెడ్డి కోరిక మేరకు వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 క్రమం ప్రకారం గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, తిరిగి తండ్రి పేరిట బదిలీ చేసేందుకు కలెక్టర్ నిర్ణయించారు. అలాగే, తండ్రి బాపురెడ్డి పోషణకు కొడుకు, బిడ్డ ఇద్దరు కలిసి ప్రతి నెలా 10 వేలు బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులను వెంటనే అమలు చేయాలని సంబంధింత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.