Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అధికారం కోసం సాధ్యంకాని హామీలను ఇచ్చారని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం చేతకాని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు వస్తున్న నేపధ్యంలో జై బాపు, జై బీమ్, జై సమ్మిదాన్ అంటూ రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రజలను మోసం చేయడానికి బయలు దేరిందని ఎద్దేవా చేశారు.
60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పాలించినప్పుడు ఎంతవరకు రాజ్యాంగాన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అబద్ధపు పాలన కారణంగానే కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండు రాష్ట్రాలకే పరిమితమైందని వాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చేస్తున్న మోసాన్ని నిలదీస్తూ బీఆర్ఎస్ కూడా త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించనున్నమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైన రూ.4 వేల ఫించన్, మహిళలకు నెలకు రూ.2500, డిగ్రీ చదివిన విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బాదె అంజలి నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, అచ్చే వేణు, సట్టు శ్రీనివాస్ , ముద్దసాని సంధ్యారెడ్డి, చల్లా రవీందర్ రెడ్డి, తిమోతి, మేడి సదయ్య, దాసరి బాలరాజు, ఓరుగంటి శంకర్, శేషగిరి, దొమ్మటి వాసు, ఇరుగురాళ్ల శ్రావణ్, సట్టు శ్రీనివాస్, కొడి రామకృష్ణ, కొలుగూరి సాయి, బచ్చాల రాములు, ఆవునూరి వెంకటేష్, చిలుముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.