Votes are not soale | మంథని, ఫిబ్రవరి 8: సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ అభ్యర్థి ఎంత ఇస్తాడో అని ఆసక్తిగా చూసే ఈ రోజుల్లో మంథనికి చెందిన యువకుడు అందుకు పూర్తి భిన్నంగా ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఏకంగా ఇంటి గేట్కే బోర్డును పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
మంథని పట్టణంలోని ఎరుకలగూడెం(హనుమాన్‌నగర్)కు చెందిన బజారు శ్రీకాంత్ అనే యువకుడు తన ఇంటి ముందు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. ప్రజా స్వామ్యాన్ని కాపాడే గొప్ప ఆయుధం నా ఓటు.. నా ఓటును మద్యానికి, డబ్బుకు అమ్ముకోను.. ఓటు విలువను పోగొట్టుకోను.. నా ఓటు నీకు, నీ అభివృద్ధి నాకు.. ఇట్లు : మీ ఓటరు’ అంటూ బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లోనే కాకుండా గతంలో జరిగిన మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ యువకుడు ఇదే విధంగా తన ఇంటి ముందు బోర్డును ఏర్పాటు చేశాడు. కొంత మంది యువత ఎన్నికలు వచ్చాయంటే మద్యం, డబ్బు కోసం అభ్యర్థుల వెంట తిరుగుతూ నానా హంగామా చేస్తుంటే ఈ యువకుడు మాత్రం అందరినీ ఆలోచింప చేసే విధంగా ఇలా ఇంటి ముందు బోర్డు పెట్టాడు. ఇతని ఇంటి ముందు బోర్డు చూసి ప్రచారానికి పలువురు అభ్యర్థులు సైతం శ్రీకాంత్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.