Volleyball tournament | సారంగాపూర్, జూలై 21: ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణ, బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించి బెస్ట్ టీమ్ లను ఎంపిక చేసి సర్కిల్ స్థాయికి పంపినట్లు సారంగాపూర్, బీర్ పూర్ ఎస్ఐలు గీత, రాజు తెలిపారు.
సారంగాపూర్ మండల స్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో పెంబట్ల, ద్వితీయ స్థానంలో సారంగాపూర్, బీర్ పుర్ మండల స్థాయిలో బీర్ పుర్ యువత, ద్వితీయ స్థానంలో తుంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన యువతకు ఎస్ఐలు మెంటోలు అందించి అభినందించారు. ఈ క్రీడా పోటీల్లో ఆయా గ్రామాల యువత, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.