చిగురుమామిడి, మార్చి 6: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేదని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని బీఆర్ఎస్ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డిని బలపరిచి గెలిపించిందన్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మద్దతుగా నిలిచి బిజెపి, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పోటీ చేసి ఉంటే ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసేదని సతీష్ కుమార్ ఆశాభవం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని అన్ని సమస్యలపై పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీసుకున్న విధానపరమైన నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత బిజెపికి కలిసి వచ్చిందని అన్నారు. ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో ఓటరు అనివార్యంగా బిజెపి వైపు మగ్గు చూపారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.