కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా.. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను మరోసారి విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. అందుకోసం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో నేడు మేడిగడ్డను సందర్శించడంతోపాటు అక్కడి వాస్తవాలను ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సన్నద్ధమైంది. అలాగే, కన్నెపల్లి పంపులను నడిపించి, పంటలకు నీళ్లివ్వాలని అల్టిమేటం జారీ చేయనున్నది. ఈ సందర్శనకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున గులాబీ దళం తరలి వెళ్లనుండగా, సర్కారు అడ్డుకోవడానికి యత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఓవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నిత్యం లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుండగా, మరోవైపు పంటలకు నీళ్లందని పరిస్థితులు ఉన్నాయి. నిజానికి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే అవకాశమున్నా, సర్కారు చోద్యంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందన్న ఒకే ఒక కారణంతోనే కాంగ్రెస్ వివక్ష చూపుతున్నదనే విమర్శలున్నాయి.
కరీంనగర్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలంలోనే సాగునీటి సమస్య మొదలైంది. ప్రభుత్వ ప్రణాళికాలోపంతో పంటలు ఎండే దుస్థితి వచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 1.48 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. ఇదంతా సముద్రం పాలవుతున్నది. దిగువన లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఎగువన మాత్రం ప్రాజెక్టులు అడుగంటుతుండగా, ఎగువమానేరు, మధ్యమానేరు, లోయర్‌మానేరు ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారింది. ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి నీటి నిల్వలు తగ్గిపోయాయి. దాదాపు అన్ని డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి.
ఈ ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది. నీళ్లు ఇవ్వాల్సిందేనంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిజానికి మేడిగడ్డ ప్రాజెక్టు అనుంబంధ కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ఉన్న ప్రవాహాన్ని చూస్తే రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. సర్కారు చొరవ చూపితే 20 నుంచి 25 రోజులపాటు వరుసగా ఎత్తిపోస్తే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని ప్రతి ప్రాజెక్టునూ నింపవచ్చని, తద్వారా చెరువులు, కుంటలను నింపుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా చేస్తే లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది.
నిజానికి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నా సర్కారు మాత్రం ఉపేక్షిస్తున్నది. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదన్న ది ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు ఆదివా రం నామమాత్రపు చర్యలు చేపట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి, వరదకాలువకు, అలాగే మధ్యమానేరుకు నీటిని కొంతమేరకు పంపారు.
కొద్ది గంటల్లోనే మళ్లీ పంపులు నిలిపివేశారు. మళ్లీ నడుపుతారో లేదో తెలియదు. నిజానికి 20 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 12 టీఎంసీల నీరు ఉన్నది. అధికారుల గణాంకాల ప్ర కారం చూస్తే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటిని ఎత్తిపోయాలంటే సుమారు పది టీఎంసీల నీటి నిల్వలు ఉండాలి. అం టే ఇవి మినహాయిస్తే ఉన్నది కేవలం రెండు టీఎంసీలే. ఈ ప్రాజెక్టులో నీటి ఇన్‌ఫ్లో పెరుగాలంటే, కడెం ప్రాజెక్టు నుంచి వరద రా వాలి. లేదంటే ఎస్సారెస్పీ నుంచి నీరు వి డుదలై గోదావరి మీదుగా రావాలి. ఇప్ప ట్లో ఈ రెండు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. నిశితంగా పరిశీలిస్తే ఎల్లంపల్లి నుంచి ఈసారి పంటలకు నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదు. అంటే ఏ కోణంలో చూసి నా మేడిగడ్డను వాడుకోవాల్సిన అవసరాలే కనిపిస్తున్నాయి. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయకపోతే ఉత్తర తెలంగాణ మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
పంపులను నడపకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను మరోసారి నొక్కి చెప్పేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో చలో కన్నెపల్లి కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం పంపుహౌస్‌ను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు జకు శ్రీహర్షిణి రాకేశ్, దావ వసంత సురేశ్, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావుతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లనున్నారు. అయితే సర్కారు ఈ సందర్శన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చూస్తున్నది. ఇప్పటికైనా రైతాంగ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా.. లేదా ఎత్తిపోస్తుందా..? అన్నది మున్ముందు తేలనున్నది.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టి, బద్నాం చేయాలని చూస్తున్నది. బీఆర్ఎస్పై అపవాదు మోపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుట్రలను ఆపాలి. కాళేశ్వరం ప్రాజెక్టును అబాసుపాలు చేయడం మానుకోవాలి. పంతాలను పక్కన పెట్టి రైతుల శ్రేయస్సు కోసం పంపులను నడపాలి. కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసి ఎల్లంపల్లిని నింపి రాష్ట్ర రైతాంగానికి నీళ్లివ్వాలి. లేదంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదమున్నది. ఇప్పటికే బోర్లు ఎత్తిపోతున్నాయి. నార్లు ముదురుతున్నాయి. పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. ఎస్సారెస్పీలో నీళ్లు లేవు. కాలువల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో నీళ్లు లేవు. పంటలకు సాగునీరు లేదు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా రైతులను కాపాడాలి. కాళేశ్వరం పంపులను నడిపించాలి. కాంగ్రెస్ కళ్లు తెరిపించడానికే ‘చలో కన్నెపల్లి’ చేపట్టాం.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే