కథలాపూర్/ మేడిపల్లి, నవంబర్ 10: ‘అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నయి. వచ్చే ఈ 20 రోజులు చాలా కీలకం. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. సైనికుల్లా పనిచేసి వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కథలాపూర్, బీమారం మండలకేంద్రాల్లో బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సీఎం కేసీఆర్ బీమా ఇంటింటికీ బీమా పథకంలో భాగంగా ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.5లక్షల బీమా, అన్నపూర్ణ పథకం కింద రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ గురించి ఇంటింటా వివరించాలని సూచించారు.
అలాగే ఇప్పటివరకు ఆసరా పింఛన్ కింద ఇస్తున్న రూ.2,016ను వచ్చే ఏడాది రూ.3,016 అవుతుందని, దశలవారీగా ఏడాదికి రూ.500 పెంచుకొని ఐదేండ్లలో రూ.5,016 అవుతుందని చెప్పారు. ఇక రైతుబంధు కింద ఎకరాకు ఇచ్చే రూ.10వేలను వచ్చేది ఏడాది రూ.12వేలకు పెరుగుతుందని, దశలవారీగా రూ.16వేలు అవుతుందని వివరించారు. ఇంకా అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా కేసీఆర్ ఆరోగ్య భీమా పరిమితిని రూ.15లక్షలకు పెంచామని, సౌభాగ్యలక్ష్మి కింద పేద మహిళలకు నెలకు రూ.3వేల సాయం, గుదిబండలా మారిన గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందించనున్నట్లు ఇంటింటా అవగాహన కల్పించి కారు గుర్తుకు ఓటేసేలా చైతన్యం తేవాలని సూచించారు.
రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందరికీ చేరాలంటే కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను దొంగల పాలు చేయవద్దని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మన ముందుకు వస్తున్న మన వేములవాడ అభ్యర్థి చల్మెడను గెలిపించుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్తిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ అరుణ, రఘు, ఎంపీటీసీ అర్జున్, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు.