కరీంనగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నిబద్ధతతో, నిజాయితీగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, గ్రామాలను సందర్శించి ప్రజలకు అవసరమైన సేవలందిస్తూ, ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామపంచాయతీ ప్రణాళికలు, పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, ఇంటి నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఈనెల 7 నుంచి 15వ వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద చేపట్టే పనులను మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డీడబ్ల్యూవో సరస్వతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేందర్, ఈఈ రాంకుమార్, యూనిసెఫ్ ప్రాజెక్టు సమన్వయకర్త కిషన్ స్వామి, ఎంపీవోలు జగన్మోహన్రెడ్డి, కిరణ్, ఎస్బీఎం రమేశ్, డీటీఎం సురేందర్‌రెడ్డి, డీఎల్పీవో లత, డీపీఎం ప్రసాద్ పాల్గొన్నారు.
సాధికారత దిశగా మహిళా సంఘాలు
మహిళా సాధికారత దిశగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వీరికి మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు తాజాగా జిల్లాలో రుచి, శుచితో కూడిన తినుబండారాలు ప్రజలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం స్వనిధి పథకం ద్వారా జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రెండో విడుత అందించే రూ.20 వేల రుణాల మంజూరులో రాష్ట్రంలోనే జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు తెలిపారు. రుణాలు తీసుకున్న వారంతా సక్రమంగా చెల్లించేలా చూడాలన్నారు. వీధి వ్యాపారులకు ఐడీకార్డులు, రిజిస్ట్రేషన్ల జారీలో జాప్యం జరుగకుండా చూడాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌ను నివారించే దిశగా మహిళా సంఘాల ద్వారా భర్తన్ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే, స్టీల్ వంట పాత్రలను టెంట్ హౌస్ నిర్వాహకులకంటే తక్కువ అద్దెకు అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, ఎల్డీఎం ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.