ఏడాదిన్నర కిందటి వరకు సకల వసతులతో కళకళలాడిన పల్లె ఇప్పుడు కన్నీరు పెడుతున్నది. పచ్చని పొలాలు.. చిక్కని బంధాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం, ఇంటిముందు, ఇంటి వెనుక, పెరట్లో పరుచుకున్న పచ్చదనంతో మొన్నటి వరకు విలసిల్లినా.. నేడు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆనవాళ్లను కోల్పోయే దుస్థితికి చేరుకుంటున్నది. ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాలు, మంకీఫుడ్ కోర్టులు ఎండిపోయాయి. డంప్ యార్డులు నిర్వహణ కరువయ్యాయి. వీధులు చెత్తాచెదారంతో అధ్వానంగా మారాయి. ఇలా ఏడాదిన్నరలోనే పల్లె రూపురేఖలు మారిపోగా.. పల్లెవాసుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జగిత్యాల, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 14 : స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2019 సెప్టెంబర్ 6న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు సరికొత్తగా ముస్తాబయ్యాయి. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 380 గ్రామ పంచాయతీలుండగా, వీటన్నింటికీ ప్రతి నెలా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా నిధులు మంజూరవుతూ వచ్చాయి. గ్రామ జనాభా ప్రకారం ఒక వ్యక్తికి ఏడాదికి 1631 చొప్పున, సగటున జిల్లాకు నెలకు వచ్చే 6.90 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఈ నిధులతో మొత్తం గ్రామాల్లోని 1,461 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 907 కిలోమీటర్ల మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్రమయ్యాయి.
అందుకోసం 500 జనాభాకు ఒక పారిశుధ్య కార్మికుడిని నియమించారు. వారికి గతంలో తక్కువ వేతనం ఉండగా, స్వరాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ నెలకు 8500 వేతనం కచ్చితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే వేతనాలు చెల్లించారు. చెత్తను తొలగించి, డంప్‌యార్డుకు తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీని, అలాగే వాటర్ ట్యాంకర్‌ను ప్రతి గ్రామం సమకూర్చుకున్నది. అలాగే, గ్రామంలో ఆదాయ వనరులను బట్టి చెత్తను తొలగించేందుకు ట్రైసైకిల్స్ను వినియోగించారు. అలాగే, ప్రతి గ్రామానికి వచ్చే నిధుల్లో పదిశాతం (9.7 కోట్లు) గ్రీన్ బడ్జెట్‌గా ప్రకటించారు. వీటిద్వారా ప్రతి గ్రామంలో నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్లను ఏర్పాటు చేసి, నాటిన మొక్కలకు రక్షణ, నీటి సరఫరా వంటివి కల్పించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 40 గ్రామాల్లో మొక్కల పెంపకానికి నర్సరీలు ఉండగా, పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత 380 గ్రామాల్లో ఏర్పాటయ్యాయి. జిల్లాలో 1683 కిలోమీటర్ల పొడవునా 2,19,089 గుంతులు తీసి మొక్కల పెంపకం చేపట్టారు. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు హామ్లెట్ గ్రామాల్లో మొత్తం 420 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటవగా, అందులో 7.70 లక్షల మొక్కలను పెంచారు. దీంతో అవి మొన్నటి వరకు ఉద్యానవనాలుగా మారిపోయాయి. 1.83 కోట్ల అంచనాలతో వీటిని పూర్తి చేశారు. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే నిధులతో పాటు, ఉపాధి హామీ పథకాన్ని వనాల నిర్మాణానికి అనుసంధానం చేశారు. శ్మశానవాటికలు లేని గ్రామాలను గుర్తించి, వైకుంఠధామాలను నిర్మించారు. జిల్లాలో 377 గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తి చేశారు. తడి, పొడి చెత్తను వేరు సేకరించేందుకు జిల్లాలో ప్రతి ఇంటికీ బుట్టలను పంపిణీ చేశారు.
ప్రతి పల్లెలో ఒక డంప్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసేందుకు 379 గ్రామాల్లో కంపోస్ట్ షెడ్లను 7.77 కోట్ల అంచనాలతో నిర్మించారు. చాలా గామాల్లోని సెగ్రేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ వచ్చారు. ఎరువులను గ్రామంలోని నర్సరీల్లో పెంచే మొక్కలకు వినియోగించారు. పల్లె ప్రగతిలో భాగంగా పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. ముళ్లపొదలు, నీటి గుంతలు, శిథలమైన భవనాలు, గుడిసెలు పూర్తిగా తొలగించారు. అలాగే, విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. జిల్లాలో 2612 చోట్ల లూజ్‌వైర్లను తొలగించారు. పాడయిన 4276 విద్యుత్ స్తంభాల స్థానాల్లో కొత్తవి వేశారు. వంగిపోయిన వెయ్యి విద్యుత్ స్తంభాలను మార్చారు. తుప్పుపట్టిన 246 స్తంభాలను తొలగించి కొత్తవి అమర్చారు. వీటితో పాటు 2500 కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. 9356 ఎల్ఈడీ విద్యుత్ బల్బులను అమర్చారు. 5299 గృహాలకు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం అనేక మార్పులకు నాంది పలికింది.
కాంగ్రెస్ సర్కారు వచ్చిన పదహారు నెలల కాలంలోనే పల్లె సొబగులు పటాపంచలయ్యాయి. పల్లెల్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గామాలను పరిశీలిస్తే పల్లె పాలన ఆగమైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. నర్సరీల్లో మొక్కలు ఎండిపోయి చచ్చిపోతున్నాయి. సరిగా నిధులు రాకపోవడంతో ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలకు నెల వారీ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గ్రామ శివారులో స్వాగత తోరణాలుగా పెరిగిన చెట్లకు నీరు పట్టే పరిస్థితి లేక అవి ఉనికిని కోల్పోయాయి. ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు సైతం డబ్బులు లేక ప్రతి రోజూ చెట్లకు నీళ్లు పట్టే పరిస్థితి లేకుండాపోయింది. మురికి కాలువలు నిండిపోయి, ఎక్కడి వ్యర్థాలు అక్కడే దర్శనమిస్తున్నాయి.
తడి, పొడి చెత్త సేకరణ అటకెక్కింది. వీధి దీపాలతోపాటు, ఇతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. చాలా గ్రామాలు రూ.లక్షల కొద్దీ విద్యుత్ బిల్లులు బకాయిపడ్డాయి. ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు నిర్వహణ లేక చాలా చోట్ల తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఏడెనిమిది నెలల క్రితం వరకు ఉద్యానవనాలుగా దర్శనమిచ్చిన ప్రకృతి వనాలు నేడు పాడుబడిన కేంద్రాలుగా కనిపిస్తున్నాయి. ఇక చాలా గ్రామాల్లో హరితహారాల్లో భాగంగా నాటిన మొక్కలను కొట్టివేతకు గురవుతున్నాయి. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట శివారులో భారీగా పెరిగిన హరితహారం చెట్లను విద్యుత్ తీగలకు అడ్డం వస్తున్నాయన్న మిషతో కొట్టివేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తానికి పాలకుల పట్టింపులేని తనం, నిధుల విడుదలలో జాప్యంతో తిరిగి పల్లెలు తమ ప్రభను కోల్పోతున్నాయి.
కోతులు అటవీ ప్రాంతాలకు వాపస్ పోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో 20కి పైగా మంకీఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. వంద ఎకరాల అటవీ స్థలాల్లో జామ, నారింజ, సపోట, అల్లనేరుడు, అరటి, తునికి, ఉసిరి, చింత ఇలా అనేక పండ్ల మొక్కలను వీటిలో నాటి పెంచే ప్రక్రియ మొదలు పెట్టారు. ఐదారేండ్లలో ఎదిగి పండ్లను ఇస్తాయని అందరూ భావించారు. అందు కోసం అప్పటి అధికారులు శ్రమించారు.
మల్యాల, సారంగాపూర్, కల్లెడ, మెట్పల్లి, కొడిమ్యాల ప్రాంతాల్లో మంకీఫుడ్ కోర్టులు మంచిగా పెరిగాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వ పట్టింపులేని తనంతో మంకీఫుడ్ కోర్టులన్నీ ఎండిపోయాయి. కల్లెడ శివారులోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంకీఫుడ్ కోర్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. చెట్లన్ని ఎండిపోయి నేలకూలిపోయాయి. ఎంతో ఆశగా అటవీ ప్రాంతాన్ని పండ్లమయం చేయాలన్న ఆలోచన నీరుగారిపోయింది. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పాలన పడకేసి, తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన రోజులు మళ్లీ ఉత్పన్నమయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది.