ముత్తారం, సెప్టెంబర్ 16 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో మొదట 61 మందిని ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా ఎంపిక చేస్తూ జాబితాలో పేర్లు ప్రకటించారని, తీరా సగం మంది పేర్లు తొలగించి 33 మందికే మంజూరు చేశారని వాపోయారు.
రెండ్రోజుల కింద జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించామని, అయినా అధికారుల నుంచి ఎలాంటి హామీ రాలేదని వాపోయారు. అందుకే వాటర్ ట్యాంకు ఎక్కామని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఏసీపీ మడత రమేశ్ బలగాలతో అకడికి చేరుకొని వారికి నచ్చచెప్పి కిందికి దింపారు. అనంతరం వారిని మండల పరిషత్ కార్యాలయానికి తీసుకెళ్లి, ఎంపీడీవో సురేశ్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆందోళన వద్దని, అర్హులైన ప్రతి ఒకరికీ ఇల్లు మంజూరయ్యేలా అధికారులకు నివేదిస్తానని ఎంపీడీవో హామీ ఇచ్చారు.
గ్రామంలో మొదట 61 మందిని అర్హులుగా గుర్తించి లిస్టు ప్రకటించిన్రు. అందులో నాదే మొదటి పేరు కావడంతో సంబురపడ్డ. కానీ, ఆ తర్వాత తీసేసిన్రు. సగం మందికి కోత పెట్టిన్రు. 61 మందిలో 33 మందికే ఇచ్చిన్రు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వాటర్ ట్యాంక్ ఎకి నిరసన తెలిపినం.
– పెరుమాండ్ల కిరణ్ (అడవిశ్రీరాంపూర్ పరిధిలోని అమ్రాబాద్)