Sand tractors | సిరిసిల్ల రూరల్, జూన్ 7: తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ్చి పోలీస్ప్లేస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మానేరు వాగు అనుకోని ఉన్న తమ గ్రామంలోంచి ఇసుక వేబిల్లులతో ఇసుక ట్రాక్టర్లు 100 నుంచి 200 ట్రాక్టర్లు గ్రామానికి వచ్చాయని పేర్కొన్నారు.
గ్రామంలో ఇరుకు రోడ్డు ఉందని, రెండు ట్రాక్టర్లు వెల్లడానికి అనువుగా ఉండదని పేర్కొన్నారు. ట్రాక్టర్ల అతి వేగం వల్ల చిన్నపిల్లలు, పశువులు, కోళ్లు ఎక్కువగా ఉన్నారని, రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో అధికారులు పునరాలోచించి వేబిల్లులలో ఇసుక ట్రాక్టర్లు మాగ్రామం నుంచి కాకుండా, గండిలచ్చపేట వంతెన క్రింది నుంచి నక్కవాగు ఓడ్డు నుండి వాగులోకి వెళ్లడానికి అనువుగా ఉంటుందని తెలిపారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లే రోడ్డు ఉందని, ట్రాక్టర్ల మార్గం చింతలపల్లె రోడ్డు నుండి నక్కవాగు రోడ్డు మార్గంలోకి మార్చాలని కోరారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతలపల్లి మహిళలు, గ్రామస్తులు ఉన్నారు.