Kondagattu | మల్యాల, జూన్ 05: జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పలు సదుపాయాలను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ ప్రశాంత్ రావు నేతృత్వంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి ప్రసాదంగా తయారు చేసే లడ్డు, పులిహోర ప్రసాదాలను పరిశీలించడంతో పాటు, వాటి తయారికి ఉపయోగించే ముడి సరుకులకు పరిశీలించారు.
అనంతరం పలు దుకాణాలకు సంబంధించిన టెండర్ నిర్వహణ ప్రక్రియ, వాటికి సంబంధించిన చెల్లింపులు, ధరలకు సంబంధించి వివరాలను ఆలయ అధికారులతో దుకాణా దారులు చేసుకున్న అగ్రిమెంట్ల వివరాలను పరిశీలించారు. 2023-24 నుండి 2025-26 వరకు గల ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇది నిరంతర ప్రక్రియ అని, తమ తనిఖీలు మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయఈవో శ్రీకాంతరావు హైద్రాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో ఉండగా, ఆలయ ప్రయవేక్షకుడు నీల చంద్రశేఖర్ ఆలయ రికార్డులను విజిలెన్స్ అధికారులకు చూపించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించడంతో డిప్యూటేషన్ పై వచ్చి నిబంధనలకు విరుద్ధముగా వుంటూ ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులలో అలజడి నెలకొంది.