జగిత్యాల, డిసెంబర్ 27: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా కొనసాగుతున్నదని, గుండాయిజంతో అధికారం చెలాయిస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మండిపడ్డారు. శనివారం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మి, 50 మంది వారి అనుచరులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే ధర్మానాయక్ తండా నుంచి చందునాయక్, వా రి అనుచరులు 10 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పచ్చని పొలాలతో కనువిందు చేశాయని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పడావు పడిపోయాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో ప్రజలు విసుగు చెందారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు బీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫ్రస్టేషన్‌తో సీఎం ఉక్కిరిబికిరవుతున్నాడని ధ్వజమెత్తారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసమని, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రెండేండ్లు గడిచినా అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణ ప్రజల నోట్లోమట్టి కొట్టి, ఆంధ్రాకు నీళ్లను మళ్లించడంతో గురుశిష్యుల బంధం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పాలనంతా అధ్వానంగా మారిందన్నారు. ఇక్కడ మం డలాధ్యక్షుడు తేలు రాజు, సర్పంచులు సంతోష్, భారతి చిరంజీవి, బీఆర్ఎస్ నాయకు లు సాగి సత్యంరావు, చిట్ల రమణ, ధరిశెట్టి రాజేశ్, మారు సాయి రెడ్డి, అనంతుల గంగారెడ్డి, ఎండబెట్ల వరప్రసాద్, భాసర్, బైరి మల్లేష్, జగన్, రమేశ్, సాంబారి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.